Diwali Special Sweeta ‘Seed crackers’ : దివ్వెల పండుగ దీపావళి వచ్చిదంటే చాలు అన్ని ముంగిళ్లు రంగు రంగుల వెలుగులతో నిండిపోతాయి. అందంతో పాటు వాయుకాలుష్యం..శబ్ద కాలుష్యం కూడా మోసుకొస్తుంది దీపావళి. ఢాంఢాంమని పేలు టపాసులతో మోత మోగిపోతుంటుంది. దీంతో శబ్ద కాలుష్యంతో చెవుల్లో కర్ణభేరి పేలిపోతుందానిపిస్తుంది. అలాగే టపాసులు కాల్చటంతో వచ్చే వాయి కాలుష్యం అటు పర్యావరణానికి ఇటు మనుషుల ఆరోగ్యానికి హాని చేస్తుంది.
కానీ దీపావళి పండుగ అంటే టపాసులు కాల్చుకోవాల్సిందే. లేదంటే ఆ సందడే రాదు అంటాం. నిజమే. కానీ అటు పర్యావరణానికి హాని కలుగకుండా మనం టపాసులు కాల్చుకున్నామని తృప్తి కలిగేలా దీపావళి పండుగను చేసుకోవచ్చంటోంది మధ్యప్రదేశ్ లోని చింద్వారా జిల్లాలోని పరద్ సింగా గ్రామానికి చెందిన శ్వేత.
వినూత్నంగా ఆలోచించి ‘‘సీడ్ క్రాకర్స్’’ కనిపెట్టింది. ఈ టపాసుల్ని భూమిలో పాతిపెడితే మొక్కలొస్తాయ్ అంటోంది. మనుషులకు కావాల్సిన ఆక్సిజన్ ఇచ్చే టపాసులన్నమాట.అలాగే ఎన్నో రకాలు స్వీట్లు కూడా తయారు చేసింది. కానీ ఈ మిఠాయిలు తినేవి కాదంటోంది.
ఈ ‘సీడ్ క్రాకర్స్’’ మామూలు టపాకాయల్లా శబ్దం రావు..పొగ కూడా రాదు.కాలుష్యాన్ని పెంచవు. అంతేకాదు ఈ ‘సీడ్ క్రాకర్స్’’తో ఇంకా ఎన్నో ప్రయోజనాలున్నాయి. హాని కలిగించవు..పైగా మనకు చక్కటి ఆక్సిజన్ ని ఇస్తాయి కూడా.
శ్వేత ‘ గ్రామ్ ప్రాజెక్టు’పేరుతో ఓ సంస్థను ప్రారంభించి ఆ సంస్థలో 60మంది మహిళల్ని చేర్చుకుంది. వారికి ట్రైనింగ్ ఇచ్చి వారితో కలిసి ఈ ‘సీడ్ క్రాకర్స్’’తయారీ మొదలుపెట్టింది. వీరంతా గత ఆరు నెలల నుంచి పేలనీ..భూమిలో పాతితే మొలకలు వచ్చే టపాసుల్ని తయారు చేస్తున్నారు.
పేలని టపాసులు..భూమిలో పాతితో మొలకలు
ఈ ‘సీడ్ క్రాకర్స్’’చిత్తు కాగితాలు, విత్తనాలతో తయారు చేస్తున్నారు. వీటిలో ఎటువంటి కెమికల్స్ గానీ పేలుడు పదార్ధాలుకానీ ఉండవ్. చిత్తు కాగితాలను సేకరించి వాటిని నానబెట్టి గుజ్జుగా చేసి వాటిలో పలు రకాల మొక్కల విత్తనాలను పెట్టి వాటికి రసాయనాలు లేని సహజ రంగులను అద్ది టపాసులుగా తయారుచేస్తారు.
గోంగూర, ఉల్లి, దోసకాయ, కొత్తమీద,మెంతులు, బెండ, వంగ, టొమాటో, ఆనబకాయ, బీర,గుమ్మడి వంటి పలు కూరగాయల విత్తనాలను పెట్టి..చిచ్చుబుడ్లు..ఉల్లిపాయ బాంబులు, భూ చక్రాలు, కాకరపువ్వొత్తులు, తారాజువ్వలు వంటి ఎన్నో రకాల టపాసుల్ని తయారుచేస్తున్నారు. ఈ టపాసుల్ని భూమిలో పాతి పెడితే చక్కగా మొకలకు వచ్చి మీ ఇంట కూరగాయల్ని పండిస్తాయన్నమాట.
తినలేని మిఠాయిలు
ఇకపోతే.. మిఠాయిలులేనిదే దీపావళి పండుగ ఎలా ఉంటుంది చెప్పండి.అందుకే శ్వేత బృందం రకరకాల మిఠాయిల్నీ తయారుచేస్తోంది. కాకపోతే ఈ మిఠాయిలు తినేవి కాదు. ఈ మిఠాయిల్ని కూడా భూమిలో పాతి పెడితే మొక్కలొస్తాయి. అంటే రకరకాల మిఠాయిల ఆకారాల్లో స్వీట్లను తయారు చేస్తారు.చిత్తు కాగితాలను నానబెట్టి వాటిని గుజ్జుగా చేసి రకరకాల సహజమైన రంగులు వేసి మిఠాయిల మోడల్ లా తయారుచేస్తారు. ఆ మిఠాయిలు తినేవి కాదని ముందే చెప్పాం కదూ. గుర్తుంచుకోవాలి మరి.
టొమాటో, ముల్లంగి, వంకాయ, బెండ, పచ్చి మిర్చి, క్యారెట్ వంటి పలు రకాల కూరగాయల విత్తనాలకు ఆ కాగితాల గుజ్జులో పెట్టి లడ్డూలు, కుకీలు,మైసూర్ పాక్, బర్ఫీలు, చమ్ చమ్ లు, బాదుషాలు వంటి స్వీట్ల ఆకారాల్లో తయారు చేస్తారు. ఇవి అచ్చు నిజమైన స్వీట్ల వలెనే ఉంటాయి. చూడగానే నోరూరించేలా ఉంటాయి. కానీ తినలేం.వాటిని కూడా భూమిలో పాతితే మొక్కలొస్తాయి.మీ ఇంటిలో కూరగాయలు పండుతాయి. కూరగాయల ధరలు మండిపోతున్న ఈ రోజుల్లో ఈ మిఠాయిల స్వీట్లు భలే ఉపయోగపడాతాయి.
ఈ మిఠాయిలు..టపాసుల్లో కూరగాయల విత్తనాలతో పాటు పూల మొక్కల విత్తనాలకు కూడా ఉన్నాయి. సీతమ్మవారి జడగంటలు..బంగాళాబంతి, నక్షత్రపూలు వంటి పూల మొక్కల విత్తనాలను కూడా వాడారు. ఇలా వాడిన ఈ విత్తనాలకు శ్వేత రైతుల నుంచి విత్తనాలను కొని ఇవి తయారుచేస్తోంది.
బరోడా వర్శిటీలో శిల్పకళలో మాస్టర్స్ చేసిన శ్వేత
బరోడా వర్శిటీలో శిల్పకళలో మాస్టర్స్ చేసిన శ్వేతకు రైతులంటే చాలా గౌరవం, ఇష్టం. శ్వేత ఈ దీపావళి సందర్భంగా మొలకెత్తే స్వీట్లు, టపాసులే కాకుండా గతంలో మొలకెత్తే క్యాలండర్లు, రాఖీలు తయారు చేసి విక్రయించగా పర్యావరణ ప్రేమికుల నుంచి చక్కటి స్పందన వచ్చింది. అంతే కాదు శ్వేత రైతుకూడా. పర్యావరణప్రేమికురాలు అయిన శ్వేత 16 ఎకరాల్లో సేంద్రీయ వ్యవసాయం చేస్తోంది. తోటి రైతులకు సలహాలు ఇస్తూ వారిని కూడా సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లేలా చేస్తోంది. తన తోటి రైతులకు చేయూతనిస్తోంది.
తాను తయారుచేసిన మొలకెత్తే టపాసుల్ని, మొలకెత్తే స్వీట్లను ఆన్ లైన్ లో విక్రయిస్తోంది. ఏపీ, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, రాజస్థాన్, బెంగళూరుల నుంచే కాకుండా పలు ప్రాంతాల నుంచి శ్వేతకు చక్కటి మొలకెత్తే ఆర్డర్లు వస్తున్నాయని తెలిపింది. ఈ ‘సీడ్ క్రాకర్స్’ ధరలు కూడా చాలా చాలా తక్కువేనంటోంది శ్వేత.