Indian Railway : మరీ అంత తక్కువా? ఇండియన్ రైల్వేలో ఒక బెడ్‌షీట్ ఉతికేందుకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా?
Indian Railways : భారతీయ రైల్వేలో ఏసీ కోచ్‌లలో ఒక బెడ్ షీట్ ఉతికేందుకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? లాండ్రీ టెండర్ పత్రం ప్రకారం.. ఒక బెడ్‌షీట్‌ను ఉతకడానికి అయ్యే రూ. 5 కంటే తక్కువే. ఇంత తక్కువ ఖర్చుకు ఎలా సాధ్యమవుతుందన్న అంశంపై చర్చ జరుగుతుంది.
Indian Railway
Indian Railway : భారతీయ రైల్వేలో ఏసీ కోచ్‌లలో ప్రయాణించే ప్రయాణికులకు వారి ప్రయాణ సమయంలో రైల్వే శాఖ లినెన్ కిట్ (linen kit) ను అందిస్తుంది. అందులో సాధారణంగా ఒక బెడ్ షీట్ (bedsheet) , దిండు, టవల్, దుప్పటి ఉంటాయి. కానీ, ఈ వస్తువులను శుభ్రపర్చడానికి రైల్వే శాఖ ఎంత ఖర్చు చేస్తుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? ఈ ప్రశ్నకు ఇండియన్ రైల్వే వివరాలు వెల్లడించింది.
లాండ్రీ టెండర్ (laundry tender) పత్రం ప్రకారం.. ఒక బెడ్‌షీట్‌ను ఉతకడానికి అయ్యే సగటు ఖర్చు కేవలం రూ.3.16 మాత్రమే. భారతీయ రైల్వే ప్రతిరోజూ కోట్లాది ప్రయాణికులకు సేవలందిస్తోంది. వేలాది ఏసీ కోచ్‌లకు అవసరమైన లినెన్‌ను సేకరించడం, ఉతికించడం, ప్యాక్ చేయడం, తిరిగి రైళ్లకు పంపించడంకోసం ప్రత్యేక ల్యాండ్రీ విభాగం పనిచేస్తుంది.
అయితే, ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్ వర్క్‌లలో ఒకటైన భారత రైల్వే వ్యవస్థలో పరిశుభ్రత నిర్వహణకు అయ్యే ఖర్చుతో పోల్చితే ఇది చాలా తక్కువగా ఉందని చాలామంది భావిస్తున్నారు.
ఏసీ కోచ్‌లలో ప్రయాణికులకు అందించే లినెన్ కిట్‌లో సాధారణంగా రెండు తెల్ల బెడ్ షీట్లు, ఒక దిండు కవర్, ఒక తువాల, ఒక దుప్పటి ఉంటాయి. తెల్ల బెడ్షీట్లను ప్రతి వినియోగం తరువాత తప్పనిసరిగా ఉతుకుతారు. దుప్పట్ల విషయంలో రైల్వేలు వేరువేరు విధానం పాటిస్తున్నారు. దుప్పట్లు ప్రతి ప్రయాణం తరువాత కాకుండా నిర్ధిష్ట వ్యవధిలో ఉతుకుతారు. అయితే, ఇంత తక్కువ ఖర్చులో రైల్వేశాఖ బెడ్ షీట్లను ఎలా ఉతికిస్తుందనేది ప్రజల మధ్య చర్చనీయాంశంగా మారింది. భారీ స్థాయి యాంత్రిక లాండ్రీ వ్యవస్థల ద్వారా ఖర్చును నియంత్రిస్తున్నట్లు ఇది సూచిస్తోంది.
భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన కూడళ్లలో పెద్ద యాంత్రిక లాండ్రీ సౌకర్యాలను నడుపుతోంది. ఇక్కడ ఒకేసారి వేలాది పరుపులు, దుప్పట్లను శుభ్రం చేయవచ్చు. నీరు, విద్యుత్, శుభ్రపరిచే పదార్థాలను అధిక పరిమాణంలో ఉపయోగించడం వల్ల ఒక్కో వస్తువుకు అయ్యే ఖర్చు గణనీయంగా తగ్గుతుంది.
