India Oil Representative Image (Image Credit To Original Source)
India: దేశ రాజకీయ, మీడియా చర్చల్లో ఓ కథనం ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ వివాదం నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడానికి భారత దేశానికి అమెరికా “పర్మిషన్ (అనుమతి)” ఇచ్చిందన్న నివేదికలు చర్చకు దారితీశాయి. అసలు ఆయిల్ కొనుగోలు చేసేందుకు భారత్ కు మరో దేశం పర్మిషన్ అవసరమా? అమెరికా అనుమతిస్తే తప్ప మనం చమురు కొనుగోలు చేయలేమా? అసలు వాస్తవం ఏంటి? అనే వివరాల్లోకి వెళితే..
ఇతర దేశాల నుంచి చమురు కొనుగోలుకు భారత్ కు పర్మిషన్ అవసరం.. ఈ స్టేట్ మెంట్ పూర్తిగా తప్పుదారి పట్టించడమే అని చెప్పాలి. అసలు భారత్ తన ఇంధన దౌత్యం, ఆర్థిక విధానాన్ని ఎలా నిర్వహిస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
నిజానికి.. చమురు కొనుగోలుకు భారత్ కు ఏ దేశం పర్మిషన్ అవసరమే లేదు. ఏ దేశం నుంచి ఆయిల్ కొనాలి అని నిర్ణయించుకునే అధికారం, స్వేచ్ఛ మనకు ఉంటుంది. మన దేశం మరో దేశం నుంచి చమురు కొనేందుకు అమెరికా పర్మిషన్ అవసరం అనే ప్రశ్న అసలు ఉత్పన్నమే అవ్వదు. భారత్ వంటి భారీ ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం, తన ప్రజల ఇంధన భద్రత కోసం తీసుకునే నిర్ణయాలు ఇతర దేశాల దయ దాక్షిణ్యాలపై ఆధారపడి ఉండవనేది నగ్న సత్యం. కొన్నేళ్లుగా దీనిపై భారత ప్రభుత్వం స్పష్టమైన సందేశాన్ని ఇస్తోంది. తాజాగా మరోసారి ఇదే విషయాన్ని చెప్పింది.
ఫిబ్రవరి 2026 నాటికి భారత దేశానికి అతిపెద్ద ముడి చమురు సరఫరాదారుగా రష్యా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. భారత రిఫైనరీలు రోజుకు సగటున 10 లక్షల నుండి 17 లక్షల బ్యారెళ్ల చమురును రష్యా నుండి ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి. అంటే మన దేశం చేస్తున్న మొత్తం దిగుమతుల్లో దాదాపు 25 నుండి 30 శాతం వాటా ఒక్క రష్యాదే. ఈ నెలలో దాదాపు 28-48 మిలియన్ బ్యారెళ్ల రష్యన్ చమురు కొనుగోలు చేసింది ఇండియా. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే భారత్ ప్రతిరోజూ దాదాపు 10 లక్షల బ్యారెళ్ల రష్యన్ చమురును కొనుగోలు చేస్తోంది.
భారత దేశ ఇంధన ఎంపికలు విదేశాల నుండి నిర్దేశించబడుతున్నాయనే వాదనను ఈ సంఖ్యలు తోసి పుచ్చుతాయి. ఒకవేళ విదేశీ శక్తుల నియంత్రణ లేదా అమెరికా అనుమతి అన్నదే నిజమైతే, అగ్రరాజ్యం ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశం నుంచి ఈ స్థాయిలో దిగుమతులు చేసుకోవడం అసాధ్యం. ఇది భారత్ పాటిస్తున్న ‘వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి’కి నిదర్శనం.
తన ఇంధన అవసరాల్లో 85 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతోంది భారత్. ఈ పరిస్థితుల్లో ధర, సరఫరా స్థిరత్వం, భౌగోళిక రాజకీయ ప్రమాదం, దేశీయ ద్రవ్యోల్బణాన్ని సమతుల్యం చేసుకోవాలి. రాయితీ ధరకు రష్యా నుండి కొనుగోలు చేసే ప్రతి బ్యారెల్ చమురు దేశీయంగా రవాణ, విద్యుత్ తయారీ రంగాల ఖర్చులను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది అంతిమంగా సామాన్య మధ్య తరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్‌లపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. అంతర్జాతీయంగా ధరల మంట తగిలినప్పుడు తన ప్రజలను రక్షించుకోవడానికి ప్రభుత్వం మార్కెట్ పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోవడం ఒక బాధ్యతాయుతమైన రాజనీతి.
రష్యా, గల్ఫ్ దేశాలు, ఇతర సరఫరాదారులతో ఉన్నట్లుగానే అమెరికాతో కూడా భారత్ టచ్ లో ఉంది. ప్రపంచంలో ప్రధాన ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య చర్చలు, సుంకాలు, రాజకీయ సందేశాలు దౌత్యంలో చాలా సహజం. కానీ అలాంటి చర్చలను “అనుమతి”గా అర్థం చేసుకోవడం వక్రీకరణే అవుతుంది. మన దేశ విదేశీ విధానాన్ని తక్కువ చేయడమే అని చెప్పాలి.
మన ఇంధన కొనుగోళ్లు.. మార్కెట్ పరిస్థితులు, జాతీయ ప్రయోజనాల ద్వారా నిర్ణయించబడతాయని భారత్ పదే పదే పేర్కొంది. వాస్తవానికి, రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు సంబంధించిన సుంకాలను ప్రకటించిన తర్వాత కూడా భారత్ తన దిగుమతులను ఆపలేదు. బదులుగా, మరిన్ని దేశాల నుంచి చమురు కొంటూ తన సరఫరా వనరులను మెరుగు పరుచుకుంది.
ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. యుద్ధం కారణంగా గ్యాస్ ఉత్పత్తిని తాత్కాలికంగా ఖతార్ నిలిపివేస్తున్నందున, ప్రపంచ ఇంధన మార్కెట్లు ఒత్తిడిలో ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో బాధ్యతాయుతమైన ప్రభుత్వం తన సేకరణ మార్గాలను విస్తృతం చేయాలి తప్ప వాటిని పరిమితం చేయకూడదు. ఈ క్రమంలో రష్యా మన దేశానికి ఒక నమ్మకమైన ఇంధన భాగస్వామిగా నిలుస్తుంది. కాబట్టి భారత దేశ చమురు విధానం ఆచరణాత్మకమైనది. కేంద్రం తన సార్వభౌమత్వానికి భంగం కలగకుండానే అటు రష్యాను, ఇటు అమెరికాను సమన్వయం చేస్తూ దేశాభివృద్ధికి కావాల్సిన ఇంధనాన్ని అత్యంత పోటీ ధరలకు సమకూర్చుకుంటోంది. మొత్తంగా చమురు కొనుగోలుకు భారత్ కు ఇతర దేశాల పర్మిషన్ (అనుమతి) అవసరం అని చెప్పుకోవడం అది వారి అజ్ఞానమే అవుతుంది.