West Bengal Governor : రాజీనామా చేయనంటు మొండికేసిన మమతా బెనర్జీ.. గవర్నర్ సంచలన నిర్ణయం
West Bengal Governor : అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా రాజీనామా చేయనంటూ మమతా బెనర్జీ మొండికేయడంతో.. గవర్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
west bengal Governor dissolve assembly after Mamata Banerjee refuses to resign
West Bengal Governor : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఎంసీ పార్టీ దారుణ పరాభవాన్ని చవిచూసింది. బీజేపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించి పశ్చిమ బెంగాల్లో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. అయితే బెంగాల్ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ సీఎం మమతా బెనర్జీ తన మొండి వైఖరిని వీడటం లేదు. తన పార్టీ ఓడిపోయినా సరే రాజీనామా చేయనంటూ మొండికేశారు. ఈ క్రమంలో బెంగాల్ గవర్నర్ ఆర్.ఎన్. రవి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మమతా బెనర్జీ సర్కార్‌ను బర్తరఫ్ చేశారు.
మమతా బెనర్జీ సీఎం పదవికి రాజీనామా చేయడానికి అంగీకరించకపోవడంతో.. గవర్నర్ రవి మే 7, గురువారం నాడు ఈ నిర్ణయం తీసుకున్నారు. మమతా రాజీనామా చేయకపోవడంతో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ గడువు ముగిసిన వెంటనే ఆర్టికల్ 174 కింద తన అధికారాలను ఉపయోగించి గవర్నర్ దానిని రద్దు చేశారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ.. మమత మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో తామే గెలిచామని, రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే గవర్నర్ మమతా బెనర్జీ సర్కార్‌ను బర్తరఫ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఇదిలా ఉంటే మే 9, శనివారం నాడు బెంగాల్లో తొలి బీజేపీ సర్కార్ కొలువుదీరబోతోంది. రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా శనివారం ఉదయం కోల్‌కతాలోని బ్రిగేడ్ గ్రౌండ్స్‌లో బెంగాల్ నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మే 8, శుక్రవారం జరిగే బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో సీఎంను ఎన్నుకుంటారు. అమిత్ షా సమక్షంలో ఈ సీఎం ఎంపిక జరుగుతుందని తెలుస్తోంది. బెంగాల్ ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఇంకా అధికారిక స్పష్టత రానప్పటికీ, సీఎం రేసులో సువేందు అధికారి ముందంజలో ఉన్నారు.
తాజా ఎన్నికల్లో సువేందు అధికారి భవానీపూర్‌లో మమతా బెనర్జీని 15 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడించారు. బెంగాల్ సీఎం పదవి బెంగాలీకే దక్కుతుందని అమిత్ షా ఇప్పటికే స్పష్టం చేశారు. బెంగాలీ మీడియం చదువుకున్న వాళ్లనే సీఎం చేస్తామని తెలిపారు. అయితే ఈ అర్హతలు సువేందు అధికారికి మాత్రమే ఉన్నాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. బెంగాల్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులు హాజరవుతారు. ఈ కార్యక్రమానికి సుమారు 5,000 మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
