State Schemes: సంక్షేమ పథకాలకు రాజకీయ నాయకులు పేర్లు పెట్టడం ఇప్పుడు దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో ఫ్యాషన్ గా మారిపోయింది. ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం అని కాదు.. ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు.. దాదాపు అన్ని చోట్ల ఇదే పరిస్థితి. ఏ పార్టీ అధికారంలో వస్తే ఆ పార్టీ వాళ్లు తమకు ఇష్టమైన నాయకుల పేర్లను స్కీమ్స్ కు పెట్టేసుకుంటున్నారు. వారి పేర్లతో పథకాలను అమలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి పీఠంలో ఎవరుంటే వారి పేరుతో స్కీమ్స్ ను వదులుతున్నారు. ఈ సంస్కృతిపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పథకాలకు అసలు రాజకీయ నాయకులు పేర్లు ఎందుకు? అని మండిపడుతున్నారు.
తాజాగా ఇదే అంశంపై మద్రాస్ హైకోర్టు స్పందించింది. ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం వాడే పేర్ల విషయంలో తమిళనాడు ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. కొత్తగా తీసుకొచ్చే ప్రజా సంక్షేమ పథకాల ప్రచారం కోసం జీవించి ఉన్న నేతల పేర్లు వాడొద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది మద్రాస్ హైకోర్టు. అంతేకాదు ప్రచార ప్రకటనల్లో మాజీ ముఖ్యమంత్రుల ఫోటోల వాడకాన్ని నిషేధించింది.
”బతికే ఉన్న రాజకీయ ప్రముఖుల పేర్లను సంక్షేమ పథకాలకు పెట్టడం లేదా ప్రభుత్వ ప్రచార సామగ్రిలో మాజీ ముఖ్యమంత్రులు లేదా భావజాల నాయకుల ఫోటోలను ఉపయోగించడం మానుకోండి” అని మద్రాస్ హైకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏఐఏడీఎంకే ఎంపీ సీవీ షణ్ముగం దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై న్యాయస్థానం ఈ తీర్పు వెలువరించింది. ఉంగలుడన్ స్టాలిన్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్టాలిన్ పేరును ఉపయోగించడాన్ని షణ్ముగం కోర్టులో సవాల్ చేశారు.
ఇటీవల, తమిళనాడు ప్రభుత్వం ముఖ్యమంత్రి పేరుతో “ఉంగలుడన్ స్టాలిన్” లేదా ‘స్టాలిన్ విత్ యు’ అనే ఔట్రీచ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం రేపు అదే పేరుతో ఆరోగ్య కార్యక్రమాన్ని ప్రారంభించాలని కూడా నిర్ణయించింది. దీనిపై సివి షణ్ముగం కోర్టును ఆశ్రయించారు. రాజకీయ వ్యక్తుల గుర్తింపులను సంక్షేమ పథకాల్లో పొందుపరచడం ద్వారా ప్రజా నిధులను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. ఇది కామన్ కాజ్ కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పులను, ప్రభుత్వ ప్రకటన (కంటెంట్ నియంత్రణ) మార్గదర్శకాలు 2014ను ఉల్లంఘించిందని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మణీంద్ర మోహన్ శ్రీవాస్తవ, న్యాయమూర్తి సుందర్ మోహన్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ ను విచారించింది.
Also Read: గుంజీలు తీసిన ఐఏఎస్ అధికారి.. ఆ వెంటనే ట్రాన్స్‌ఫర్ చేసిన ప్రభుత్వం.. అసలేం జరిగింది..