Drdo Vaccine
DRDO: కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో డీఆర్‌డీవో గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా బారినపడ్డ వారి ఆరోగ్యం విషమిస్తే అత్యవసర వినియోగానికి గానూ వ్యాక్సిన్ రెడీ చేసింది. దీంతో ఆక్సిజన్ పెట్టాల్సిన అవసరాన్ని తగ్గించేందుకు తోడ్పడే ‘2–డీజీ’ ఔషధాన్ని త్వరలో మార్కెట్లోకి తీసుకురానున్నట్టు ప్రకటించింది. కరోనా బాధితులపై నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో ‘2–డీజీ’ మంచి ఫలితాలు ఇచ్చిందని, ఈ మేరకు అత్యవసర వినియోగానికి ‘డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ)’అనుమతులు వచ్చాయి.
ఈ మేరకు డీఆర్‌డీవో చైర్మన్ జి.సతీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. డీఆర్‌డీవో అనుబంధ సంస్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అల్లైడ్ సైన్సెస్ (ఇన్‌మాస్) ఈ ‘2–డీజీ’మందును అభివృద్ధి చేసిందని.. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఫార్మా కంపెనీ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ కలిసి ప్రయోగాలు నిర్వహించిందని తెలిపారు.
‘2–డీజీ’ఇచ్చిన కోవిడ్ రోగుల్లో చాలా మందికి నాలుగైదు రోజుల్లోనే కోవిడ్ నెగెటివ్ వచ్చిందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా పెరిగిపోతోన్న కోవిడ్ కేసులు, ఆక్సిజన్ కొరతతో అల్లాడుతున్న సమయంలో ‘2–డీజీ’అందుబాటులోకి వస్తుండటంతో ఊరటగా కనిపిస్తుంది.
కరోనా వైరస్ పంజా విసరడం తొలినాళ్లలోనే .. గత ఏడాది ఏప్రిల్‌లోనే ఈ వైరస్‌కు మందు కనిపెట్టడంపై ఫోకస్ పెట్టింది ఇన్‌మాస్ సంస్థ. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ)తో కలిసి పరిశోధనలు చేసి.. ‘2–డీజీ (2 డీఆక్సి–డీ గ్లూకోజ్)’మందును రూపొందించింది. ఇది కరోనా వైరస్ పెరుగుదలను సమర్థవంతంగా అడ్డుకుంటోందని గుర్తించి.. క్లినికల్ ట్రయల్స్ కోసం ‘సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌డీఓ)’కు దరఖాస్తు చేసింది.
ఈ మేరకు అనుమతి రావడంతో గతేడాది మే నెలలోనే డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఫార్మా కంపెనీతో కలిసి.. కోవిడ్ రోగులపై ప్రయోగాత్మక పరిశీలన చేపట్టింది. ఈ మందు కెపాసిటీ, సేఫ్టీ ఏ మేరకు ఉన్నాయనేది నిర్ధారించేందుకు ప్రయోగాలు నిర్వహించింది. ఇది సమర్థవంతంగానే పనిచేస్తుందని స్పష్టమైంది.
గత ఏడాది మే – అక్టోబరు మధ్య నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో ‘2–డీజీ’మందు సురక్షితమైనదేనని, రోగులు వేగంగా కోలుకునేందుకు ఉపయోగపడుతోందని తెలిసింది.
తర్వాత రెండో దశలో ఫేజ్–2ఏ కింద 6 ఆస్పత్రుల్లో, ఫేజ్–2బీ కింద 11 ఆస్పత్రుల్లో పరిశీలన చేపట్టారు. మొత్తం 110 మంది రోగులకు 2–డీజీ మందును ఇచ్చి ఫలితాలను పోల్చి చూశారు. సాధారణ చికిత్సా పద్ధతులతో పోలిస్తే 2–డీజీ మందు ఇచ్చిన రోగులు.. కోవిడ్ లక్షణాల నుంచి వేగంగా బయటపడుతున్నట్టు గుర్తించారు. 2–డీజీ తీసుకున్నవారు 3 రోజులు ముందుగానే కోలుకుంటున్నారట.
మూడో దశలోనూ సత్ఫలితాలు
తొలి, రెండు దశల ప్రయోగాలు విజయవంతమైన నేపథ్యంలో మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు గత ఏడాది నవంబరులోనే డీసీజీఐ అనుమతులు ఇచ్చింది. డిసెంబరు – మార్చి మధ్య 220 మంది రోగులకు ఈ మందును ఇచ్చి పరిశీలించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని 27 కోవిడ్ ఆస్పత్రుల్లో పేషెంట్లపై ప్రయోగాలు చేశారు. 2–డీజీ మందు ఇవ్వడం మొదలుపెట్టిన మూడో రోజు నుంచే దాదాపు 42 శాతం మంది రోగుల్లో ఆక్సిజన్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా పోయింది.
పొడి.. నీళ్లలో కలుపుకొని తాగడమే
2–డీజీ మందు.. పొడి రూపంలో లభిస్తుంది. దానిని నీటిలో కరిగించుకుని తాగాలి. ఈ ఔషధం మన శరీరంలో వైరస్ సోకిన కణాల్లోకి చేరుకుని.. ఆ కణాల నుంచి వైరస్‌లు శక్తి పొందకుండా నిరోధిస్తుంది. దీంతో వైరస్ వృద్ధి తగ్గిపోతుంది. వైరస్‌తో కూడిన కణాల్లోకే చేరుకోవడం 2–డీజీ ప్రత్యేకత. ఈ మందులోని అణువులు.. సాధారణ గ్లూకోజ్ అణువులను పోలి ఉండటం వల్ల విస్తృతంగా ఉత్పత్తి చేయడానికి వీలుందని డీఆర్‌డీవో చైర్మన్ జి.సతీశ్‌రెడ్డి తెలిపారు.