ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం అవుతున్న కేంద్ర ఎన్నికల సంఘం.. కీలక ఆదేశాలు

Lok Sabha elections 2024: ప్రవర్తనా నియమావళి అమలు, చట్టపరమైన నిబంధనలు, ఈవీఎం/వీవీప్యాట్ల నిర్వహణ, మీడియా ఎంగేజ్‌మెంట్ పై పరిశీలకులకు అవగాహన కల్పించింది.

సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో ఎన్నికల పరిశీలకులతో ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్ సమావేశం నిర్వహించారు. వివిధ రాష్ట్రాల నుంచి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా అబ్జర్వర్లకు కీలక సూచనలు చేశారు. పోలింగ్ స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఎన్నికల సంఘం నిబంధనలను పాటించే విధంగా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది ఈసీ. పరిశీలకుల వాహనాలకు జీపీఎస్ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని చెప్పింది.

ఎన్నికల నిర్వహణకు ఫిర్యాదుల కోసం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ,మెయిల్ నంబర్స్ కు తగిన ప్రచారం కల్పించాలని దిశానిర్దేశం చేసింది. ఎన్నికల పరిశీలకులందరూ ఫోన్, మెయిల్ కు అందుబాటులో ఉండాలని చెప్పింది. ఎన్నికల ప్రణాళిక, పరిశీలకుల పాత్రతో పాటు వారి బాధ్యతలు, ఎలక్టోరల్ రోల్ సమస్యలు, ప్రవర్తనా నియమావళి అమలు, చట్టపరమైన నిబంధనలు, ఈవీఎం/వీవీప్యాట్ల నిర్వహణ, మీడియా ఎంగేజ్‌మెంట్ పై పరిశీలకులకు అవగాహన కల్పించింది.

స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, బెదిరింపులు, ప్రలోభాలు లేకుండా ఎన్నికలు జరిగేలా చూడాలని పరిశీలకులకి దిశానిర్దేశం చేశారు రాజీవ్ కుమార్. పోలింగ్‌ కేంద్రాలను సందర్శించి భౌగోళిక పరిస్థితులపై అవగాహన పెంచుకోవాలని చెప్పారు. సున్నిత ప్రాంతాలను పరిశీలించాలని సూచించారు. పోలింగ్ రోజున పోలింగ్ వేళల్లో, వీలైనన్ని ఎక్కువ పోలింగ్ కేంద్రాలను సందర్శించి, పోలింగ్ స్టేషన్‌లలోని పరిస్థితిని క్రమం తప్పకుండా అంచనా వేయాలని అన్నారు.

 Also Read: మంత్రులు భట్టి, కొండా సురేఖను కింద కూర్చోబెట్టి అవమానించారు: కవిత