బాబోయ్.. ఈడీ రైడ్స్‌లో కళ్లు చెదిరే స్వర్ణ, వజ్రాభరణాలు, భారీగా కరెన్సీ కట్టలు.. వాటి విలువెంతో తెలుసా..! వైఎస్ రెడ్డి అవినీతి సామ్రాజ్యం..

టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ నివాసంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు రైడ్ చేయగా.. కళ్లు చెదిరే స్వర్ణ, వజ్రాభరణాలు, భారీ మొత్తంలో నగదు లభ్యమైంది.

ED Raids

ED Raids in YS Reddy House: ముంబై టౌన్ ప్లాన్ డిప్యూటీ డైరెక్టర్ వైఎస్ రెడ్డి నివాసాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు రైడ్ చేయగా.. కళ్లు చెదిరే స్వర్ణ, వజ్రాభరణాలు, భారీ మొత్తంలో నోట్ల కట్టలు లభ్యమయ్యాయి. ముంబై, హైదరాబాద్, ఏపీలోని కర్నూలుతోపాటు మొత్తం 13 చోట్ల ఈడీ అధికారులు రైడ్ చేశారు. మహారాష్ట్రలోని మిరబయందర్ పోలీసు స్టేషన్ లో నమోదైన కేసుల ఆధారంగా ఈడీ అధికారులు వైఎస్ రెడ్డికి సంబంధించిన ప్రాంతాల్లో దాడులు చేశారు. ఈడీ సోదాల్లో రూ.9.04కోట్ల నగదు, రూ.23.25కోట్ల బంగారు, వజ్రాభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు ప్రకటనలో వెల్లడించారు.

 

సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, డంపింగ్ యార్డు కోసం కేటాయించిన స్థలాల్లో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చి కోట్లాది రూపాయలు వైఎస్ రెడ్డి సంపాదించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో కొన్నాళ్లుగా వైఎస్ రెడ్డి, ఆయన బంధువులు, సన్నిహితులపై నిఘా పెట్టారు. పూర్తి సమాచారం సేకరించిన తరువాత ఈడీ అధికారులు గురువారం ముంబై, హైదరాబాద్, కర్నూలు ప్రాంతాల్లో వైఎస్ రెడ్డి నివాసాలు, ఆయన బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో 13చోట్ల సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో స్వర్ణ, వజ్రాభరణాలు, భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. వైఎస్ రెడ్డి కర్నూలు జిల్లాకు చెందిన వ్యక్తిగా సమాచారం. ఆయన హైదరాబాద్ లో ఎక్కువగా ఆస్తులను కూడబెట్టినట్లు ఈడీ అధికారుల విచారణలో వెల్లడైంది.

 

వైఎస్ రెడ్డి గతంలోనూ ఏసీబీ కేసులో అరెస్ట్ అయ్యారు. వీవీఎంసీలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న క్రమంలో ఓ కార్పొరేటర్ నుంచి రూ.25లక్షలు లంచం తీసుకుంటుండగా 2016లో థానే ఏసీబీ అధికారులు జరిపిన సోదాల్లో 11 అపార్ట్‌మెంట్లలో ప్లాట్లు, తొమ్మిది వ్యవసాయ భూములను గుర్తించారు.