Gold: కెనడాలో రూ.173 కోట్ల బంగారం చోరీ కేసు.. భారత్‌లో ఇతడి ఇంట్లో సోదాలు

దీనిలో తొమ్మిది మంది పాల్గొన్నారని కెనడా పోలీసులు తేల్చారు.

కెనడాలోని టొరంటో పియర్‌సన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏప్రిల్ 2023, 17న భారీ చోరీ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆ బంగారం దొంగతనం కేసులో కీలక నిందితుడు, ఎయిర్ కెనడా మాజీ మేనేజర్, భారత్‌కు చెందిన ‘సిమ్రన్ ప్రీత్ పనేసర్’ ఇంటిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దాడులు నిర్వహించింది.

శుక్రవారం ఉదయం పంజాబ్‌లోని మొహాలీ, సెక్టార్ 79లోని ఆయన ఇంటి వద్ద ఈడీ తనిఖీలు చేసింది. త్వరలోనే పనేసర్‌ను కూడా విచారించనున్నట్లు తెలుస్తోంది. సిమ్రన్ ప్రీత్ పనేసర్ కేసు విషయంలో మనీ లాండరింగ్ కోణంలో ఈడీ విచారిస్తుంది. అలాగే చోరీ అయిన బంగారం, దాని ద్వారా వచ్చిన నగదను భారతదేశానికి తరలించారా? అనే విషయాన్ఇన రాబట్టడానికి యత్నిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు.

భారతీయ అధికారులు కెనడా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. విచారణ ముగియగానే పనేసర్‌ను కెనడాకు అప్పగించే అవకాశం ఉందని సమాచారం. ఈడీ నిజాలను బయటపెట్టేందుకు కృషి చేస్తోంది. ఇప్పటివరకు ఆ బంగారం మొత్తాన్ని రికవర్ చేయకపోవడం, నిందితుల అరెస్ట్ ఇంకా జరగకపోవడం ఆందోళన కలిగించే అంశాలుగా మారాయి.

Also Read: కొత్తగా వచ్చిన ఐఫోన్ 16ఈ బెటరా? ఇప్పటికే ఉన్న ఐఫోన్‌ 16 బెటరా? ఏది కొనాలి? ఫుల్‌ డీటెయిల్స్‌..

ఇంతకీ చోరీ ఎలా జరిగిందంటే.. ఏప్రిల్ 2023, 17న స్విట్జర్లాండ్ నుంచి ఓ కార్గో విమానం కెనడాలోని టొరంటో పియర్‌సన్‌ ఎయిర్‌పోర్టులో దిగింది. అందులోని ఓ కంటైనర్‌లో 400 కిలోల బరువైన 6,600 బంగారు కడ్డీలు ఉన్నాయి. వీటి విలువ అప్పట్లో 20 మిలియన్ కెనడియన్ డాలర్లుగా అంచనా వేశారు. అంటే దాదాపు రూ.173 కోట్లుగా ఉంటుంది. బంగారంతో పాటు కంటైనర్‌లో 2.5 మిలియన్ కెనడియన్ డాలర్ల నగదు కూడా ఉంది. వీటన్నిటిని టొరంటోలోని ఓ కేంద్ర బ్యాంక్‌లో భద్రపరచేందుకు తీసుకువచ్చారు.

విమానం దిగిన వెంటనే, సెక్యూరిటీ కంటైనర్‌ను ఎయిర్‌పోర్టులోని వేర్‌హౌస్ ఫెసిలిటీలో భద్రపరిచారు. అయితే, విధుల్లో భాగంగా మరుసటి రోజున పోలీసులు తనిఖీ చేయగా, కంటైనర్‌లోని మొత్తం బంగారం, నగదు మాయమైనట్లు గుర్తించారు. అప్పట్లో ఈ సంఘటన కెనడా దేశ చరిత్రలోనే అతిపెద్ద దోపిడీగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

‘వేర్‌హౌస్ ఫెసిలిటీ’ లో పనిచేస్తున్న ఎంప్లాయిస్ ఫేక్ సర్టిఫికెట్స్ ఉపయోగించి ఆ కంటైనర్‌లో ఉన్న సొమ్ము మొత్తాన్ని దొంగతనం చేశారని, దీనిలో తొమ్మిది మంది పాల్గొన్నారని కెనడా పోలీసులు తేల్చారు. వారిలో సిమ్రన్‌ప్రీత్‌, పరంపాల్ సిద్ధు అనే ఇద్దరు ఇండియన్స్ ఉన్నట్లు పోలీసులు తేల్చారు. 2023 మేలో, పరంపాల్‌ను అరెస్టు చేయగా, సిమ్రన్‌ప్రీత్‌ ఇండియాలో తలదాచుకున్నట్లు పోలీసులు వెల్లడించారు., అయితే కొంత మొత్తం నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

ఈ ఘటన కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీగా సంచలనం సృష్టించింది. దర్యాప్తులో, నకిలీ పత్రాలను ఉపయోగించి వేర్‌హౌస్ సిబ్బందే దొంగతనం నిర్వహించినట్లు పోలీసులు తేల్చారు. ఘటన జరిగిన సమయంలో, సిమ్రన్‌ప్రీత్‌ మరియు పరంపాల్ సిద్ధు అనే ఇద్దరు భారతీయులు వేర్‌హౌస్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. దీనిపై పోలీసులు వీరిద్దరు సహా తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు.