Delhi Assembly Elections 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. ఫిబ్రవరి 5న పోలింగ్‌

ఫిబ్రవరి 23తో ఢిల్లీ అసెంబ్లీ పదవీకాలం ముగియనుండడంతో ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు.

Delhi Assembly Elections 2025 Schedule

Delhi Assembly Elections 2025 Schedule: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ రాజీవ్ కుమార్ ప్రకటించారు. ఢిల్లీలో నేటి నుంచి ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. ఢిల్లీలో ఫిబ్రవరి 5న ఒకే దశలో ఓటింగ్ నిర్వహిస్తామని, ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు ఉంటుందని రాజీవ్ కుమార్ అన్నారు.

ఫిబ్రవరి 23తో ఢిల్లీ అసెంబ్లీ పదవీకాలం ముగియనుండడంతో ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. బీజేపీ, ఆప్‌, కాంగ్రెస్‌ ఇప్పటికే కొన్ని స్థానాల్లో తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించాయి.

దేశంలోని పోలింగ్ ప్రక్రియపై ఓటర్లు అవగాహనతో ఉన్నారని రాజీవ్ కుమార్ చెప్పారు. ఈవీఎంలపై సందేహాలు అవసరం లేదని తెలిపారు. ఓటర్ల జాబితాకు సంబంధించి వస్తున్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు.

ఈవీఎంలో ఏదైనా లోపాలు ఉన్నట్లు వస్తున్న ప్రచారానికి ఆధారాలు లేవని తెలిపారు. ఈవీఎంలో వైరస్ లేదా బగ్‌ను ప్రవేశపెట్టే అవకాశమే లేదని చెప్పారు. ఈవీఎంలో చెల్లని ఓట్ల ప్రశ్నే లేదని, రిగ్గింగ్ లేదని స్పష్టం చేశారు. తాము ర్యాండమ్‌గా వీవీ ప్యాట్‌ స్లిప్పులను లెక్కిస్తున్నామని, ఇప్పటివరకు స్లిప్పుల లెక్కింపుల్లో ఎక్కడా తేడా రాలేదని తెలిపారు. ట్యాంపరింగ్‌ జరుగుతుందనేది నిరాధార ఆరోపణ అని అన్నారు. యూపీలోని మిల్కీ పూర్, తమిళనాడులోని ఇరోడ్ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్  

  • జనవరి 10న ఎన్నికల నోటిఫికేషన్
  • నామినేషన్ దాఖలుకు చివరి తేదీ జనవరి 17
  • నామినేషన్ల పరిశీలన జనవరి 18
  • నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ జనవరి 20
  • ఫిబ్రవరి 5 పోలింగ్.. ఫిబ్రవరి 8 ఓట్ల లెక్కింపు, ఫలితాలు
  • ఫిబ్రవరి 10 నాటికి ముగియనున్న ఎన్నికల ప్రక్రియ

Hyderabad: ప్రియాంకనే అంటారా.. బీజేపీ కార్యాలయంపై కోడి గుడ్లు, రాళ్లతో దాడి.. పలువురికి గాయాలు