నేతల్లో టెన్షన్ :  రాహుకాలంలో ఎన్నికల ప్రకటన 

  • Publish Date - March 11, 2019 / 03:34 AM IST

రాహుకాలం…..నాలుగక్షరాల ఆ పదం రాజకీయనాయకులను ఇప్పుడు వణికిస్తోంది. మహామహానేతలను సైతం నానుంచి తప్పించుకోలేవంటూ భయపెడుతోంది. పొలిటికల్‌  హిస్టరీలో తమదైన స్టైల్‌లో చక్రం తిప్పిన నేతలను  కూడా ఆ నాలుగుక్షరాల పదం  సెంటిమెంటల్‌గా  షివరింగ్ తెప్పిస్తోంది. పొలిటికల్ హీట్‌ను  మించిన హీట్‌తో కొన్ని రాష్ట్రాలను సైతం తన గ్రిప్‌లో పెట్టుకుని గులాం కొట్టించుకుంటోంది. ఆ నాలుగక్షరాల పదమే.. రాహుకాలం. మరి ఈ సారి ఎన్నికల విషయంలో నేతలంతా రాహుకాలం గురించి ఎందుకు భయపడుతున్నారో తెలుసా..?

రాహుకాలం… పెళ్లిళ్లకు, శుభకార్యాల సమయంలోనే మాత్రమే వినిపించే మాట ఇప్పుడు రాజకీయాల్లోనూ హాట్‌ టాపిక్‌గా మారింది. మామూలుగానే రాహుకాలం , వర్జ్యాలపై దక్షిణాది రాష్ట్రాలు కాస్త పట్టింపుగానే ఉంటాయి.  ఐదేళ్ల రాజకీయ నాయకుల భవితవ్యాన్ని నిర్ధేశించే స్థాయిలో  కూడా ఇప్పుడు ఓ ఊపు ఊపుతోంది. ఎవరు కాదన్నా…..ఔనన్నా ఈ రాహుకాలమే  ఆదివారం మార్చి 10 న ఎన్నికల కమిషన్ ఎనౌన్స్‌మెంట్‌పై సైతం తనదైన మార్కు వేసింది.

లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల షెడ్యూలుతో పాటు ఆంధ్ర ప్రదేశ్, సిక్కిం, ఒరిస్సా, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల కమిషన్ రాహు కాలంలో ప్రకటించడంతో పలు పార్టీల నాయకులు అవాక్కైయ్యారు. చవితి రోజున రాహు కాలంలో ప్రకటించడం గుబులు కలిగించిందని పలువురు వ్యాఖ్యానించారు. ఎంతో ఉత్కంఠగా మారిన ఎన్నికల షెడ్యూల్‌ను సాయంత్రం 5 గంటల తర్వాత విడుదల చేసింది ఎన్నికల సంఘం. ఇదే ఇప్పుడు రాజకీయవర్గాల్లో అలజడి రేపుతోంది. సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకూ రాహుకాలం ఉంది. ఈ సమయంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో.. ఎవరికి గండం వస్తుందో అన్న టెన్షన్ కనిపిస్తోంది.   అయితే ఉత్తరాది రాష్ట్రాల కంటే దక్షిణాది రాష్ట్రాల్లోనే వాస్తు, జ్యోతిష్యం, పంచాంగం వంటి వాటిపై ఎక్కువగా నమ్మకం ఉంటుంది.

ముహూర్తాల సెంటిమెంట్‌ కర్నాటకలో బాగా ఎక్కువ. చాలామంది నేతలు రాహుకాలం ముగిసాకే  కీలక సమావేశాలను ఏర్పాటు చేసుకుంటారు. ఈ విషయంలో బీఎస్ యడ్యూరప్ప, సిద్ద రామయ్యతో పాటు.. మాజీ ప్రధాన మంత్రి దేవెగౌడ కూడా రాహుకాలం సెంటిమెంట్‌ను గట్టిగానే ఫాలో అవుతారు. అందుకే.. వీరందరికీ ఇప్పుడు రాహుకాలం భయం పట్టుకున్నట్లు కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సెంటిమెంట్ భారీగానే ఉంది. దీంతో ఈ సారి ఫలితాల ప్రభావం ఎవరిపై ఎలా ఉంటుందో అన్న ఆందోళన అందరిలోనూ కనిపిస్తోంది. 

కాగా….తెలంగాణ రాష్ట్ర సమితి మాత్రం రాహుకాలం విషయంలో ఈ సారి ధీమాను వ్యక్తం చేస్తోంది. ఎందుకంటే రెండు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సరిగ్గా అమావాస్య రోజునే జరిగింది. దీంతో చాలా మంది టీఆర్‌ఎస్‌కు గడ్డుకాలం ప్రారంభమైంది కాబట్టే అమావాస్య రోజున పోలింగ్ వచ్చిందని వ్యాఖ్యానించారు. ఫలితాలు చూశాక వారంతా నాలిక కరచుకున్నారు. కాబట్టి ఇప్పుడు రాహు కాలంలో షెడ్యూలు ప్రకటించినంత మాత్రాన నష్టమేమీ జరగదన్న ధీమాను వారు వ్యక్తం చేస్తున్నారు.