Price Hike
Price Hike: ల్యాప్‌టాప్, టీవీ, స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారా..? అయితే, మీకు బిగ్ షాకింగ్ న్యూస్. రాబోయే కొద్దిరోజుల్లో ఆయా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు భారీగా పెరగబోతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో పెరిగిన డిమాడ్‌తో చిప్ తయారీ కంపెనీలు తమ ఉత్పత్తిని అటువైపు మళ్లించడమే ఈ సంక్షోభానికి ప్రధాన కారణం. దీంతో సాధారణ వినియోగదారుల కోసం ఉత్పత్తి చేసే గ్యాడ్జెట్లపై తీవ్ర ప్రభావం పడుతోంది.
Also Read : US Strikes : వెనెజువెలా తరహాలో దాడికి అమెరికా సన్నాహాలు..? ఇరాన్ వైపు అమెరికా యుద్ధనౌకలు..
ప్రపంచ వ్యాప్తంగా ఏఐ డేటా సెంటర్ల నిర్మాణం ఊపందుకోవడంతో శాంసంగ్, ఎస్‌కే హైనిక్స్ వంటి ప్రధాన కంపెనీలు అధిక లాభాలనిచ్చే హై-బ్యాండ్‌విడ్త్ మెమరీ (HBM) చిప్‌ల తయారీకి ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఫలితంగా స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లలో వాడే డీ-ర్యామ్ (DRAM), నాండ్ (NAND) ప్లాష్ మెమరీ చిప్‌లకు కొరత ఏర్పడింది. ఇప్పటికే కొన్ని రకాల చిప్‌ల ధరలు 60శాతం వరకు పెరిగాయి. రాబోయే రెండుమూడు నెలల్లో స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌ల ధరలు 4 నుంచి 8శాతం వరకు పెరగవచ్చునని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నారు.
కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ప్రకారం.. ప్రపంచ మెమరీ మార్కెట్ హైపర్-బుల్ దశలోకి ప్రవేశించింది. గత త్రైమాసికంలో దాదాపు 50శాతం ధరల పెరుగుదల తర్వాత ప్రస్తుత త్రైమాసికంలో ధరలు మరో 40 నుంచి 50శాతం పెరుగుతాయని, ఆ తర్వాత ఏప్రిల్, జూన్ మధ్య అదనంగా 20శాతం పెరుగుతుందని అంచనా.
జనవరిలో వివో, నథింగ్ వంటి కొన్ని స్మార్ట్ ఫోన్ బ్రాండ్లు ధరలను రూ.3వేల నుంచి రూ.5వేల వరకు పెంచాయి. అయితే, శామ్‌సంగ్ వంటి మరికొన్ని కంపెనీలు క్యాష్‌బ్యాక్‌లు, డిస్కౌట్లను తగ్గించడం వంటి పరోక్ష ప్రయత్నాలు చేస్తున్నాయని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ పరిశోధన డైరెక్టర్ తరుణ్ పాఠక్ ఫైనాన్షియల్ డైలీకి తెలిపారు.
సూపర్ ప్లాస్ట్రోనిక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అవనీత్ సింగ్ మార్వా మాట్లాడుతూ.. మేము నవంబర్ నెలలో ధరలను 7శాతం పెంచాము. ఇప్పుడు ఈ నెలలో 10శాతం పెరిగాయి. ఫిబ్రవరి నెలలో మరో 4శాతం పెంచేందుకు ప్లాన్ చేస్తున్నాము. వాస్తవానికి రాబోయే గణతంత్ర దినోత్సవ అమ్మకాల్లో డిస్కౌంట్లు తక్కువగానే ఉంటాయని ఆయన చెప్పుకొచ్చారు.
ధరల పెరుగుదల ప్రభావం ఇప్పటికే దుకాణాలపై కనిపిస్తోందని రిటైలర్లు పేర్కొంటున్నారు. ల్యాప్‌టాప్ ధరలు 5 నుంచి 8శాతం పెరిగాయి, పెద్ద టెలివిజన్ బ్రాండ్లు ధరలు పెరిగే అవకాశం ఉందని తెలిపాయి. ఈ ధరల పెరుగుదల తక్షణ డిమాండ్‌ను ప్రభావితం చేస్తుందని పలువురు పేర్కొంటున్నారు.
నవంబర్, డిసెంబర్ నెలల్లో స్మార్ట్ ఫోన్ల ధరలు 3శాతం, 21శాతం మధ్య పెరిగాయని ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ (AIMRA) తెలిపింది. దేశవ్యాప్తంగా 1,50,000 కంటే ఎక్కువ మొబైల్ ఫోన్ స్టోర్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్న అసోసియేషన్.. బ్రాండ్ల నుండి ప్రస్తుతం సంకేతాలు రాబోయే రెండుమూడు నెలల్లో ధరల పెరుగుదల 30శాతంకు చేరుకోవచ్చునని సూచిస్తున్నాయని తెలిపింది.