Environment Ministry Sets New Deadlines For Thermal Power Plants To Meet Emission Norms
thermal power plants కాలుష్య ఉద్గారాల కట్టడికి సంబంధించిన నూతన ప్రమాణాలను అందుకునేందుకు థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాలకు (టీపీపీలు) కేంద్ర పర్యావరణ శాఖ కొత్త గడువును నిర్దేశించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రాంతాలవారీగా టీపీపీలను 3 కేటగిరీలుగా వర్గీకరించేందుకు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (CPCB) ఓ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు ఏప్రిల్-1న విడుదల చేసిన నోటిఫికేషన్ లో కేంద్ర పర్యావరణ శాఖ పేర్కొంది.
కేంద్ర పర్యావరణ శాఖ తాజా నోటిఫికేషన్ ప్రకారం.. జాతీయ రాజధాని ప్రాంతానికి (ఎన్‌సీఆర్) 10 కి.మీ.ల పరిధిలో, 10 లక్షల జనాభా దాటిన నగరాల్లో టీపీపీలు 2022 సంవత్సరం ఆఖరు నాటికి లక్ష్యాలను చేరుకోవాల్సి ఉంటుంది. ఐదేళ్ల కాలంలో జాతీయ వాయు నాణ్యత ప్రమాణాలను అందుకోవడంలో విఫలమైన ‘నాన్-ఎటైన్‌మెంట్’ నగరాలు, తీవ్రంగా కాలుష్య సమస్య ఎదుర్కొంటున్న ప్రాంతాలకు 10 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న టీపీపీలకు ఈ గడువు 2023 డిసెంబరు 31గా ఉంటుంది. దేశంలో నాన్ ఎటైన్‌మెంట్ నగరాలు 124 ఉన్నాయి. మిగతా ప్రాంతాల్లోని థర్మల్ విద్యుత్ కేంద్రాలు డిసెంబర్-31,2024 నాటికి కొత్త ప్రమాణాలను అందుకోవాలి.
ఇక, 2025 డిసెంబరు 31లోగా మూసేసే కర్మాగారాలు ఈ నిబంధనలను అమలు చేయాల్సిన అవసరం లేదు. అయితే కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు, కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ నుంచి ఈ మేరకు మినహాయింపు పొందాల్సి ఉంటుంది.
థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి వెలువడే ఉద్గారాల్లో పార్టికులేట్ మ్యాటర్ (పీఎం), సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్‌ల స్థాయికి సంబంధించి 2015 డిసెంబర్ లోనే కేంద్ర పర్యావరణ శాఖ నిబంధనలను సవరించింది. దీనికి అనుగుణంగా ఉద్గార నియంత్రణ వ్యవస్థలను 2017 డిసెంబర్ లోగా ఏర్పాటు చేసుకోవాలని టీపీపీలకు స్పష్టంచేసింది. అయితే వీటి అమలులో ఉన్న ఇబ్బందులు, సవాళ్ల దృష్ట్యా ఈ గడువును 2022 డిసెంబర్ నాటికి పొడిగించింది. జాతీయ రాజధాని ప్రాంతంలోని థర్మల్ కేంద్రాలకు మాత్రం ఆ గడువును 2019 సంవత్సరాంతానికి నిర్దేశించింది. అయితే కరోనా మహమ్మారి, దిగుమతికి సంబంధించిన ఆంక్షలు వంటి కారణాలను ప్రస్తావిస్తూ టీపీపీలకు గడువును 2022 నుంచి 2024 నాటికి పెంచాలని ఇటీవల కేంద్ర విద్యుత్ శాఖ.. పర్యావరణ శాఖకు విజ్ఞప్తి చేసింది.