కేరళలోని ఎర్నాకుళంలో గుండెలు జలదరించే ఘటన జరిగింది. ఓ ఫోటో గ్రాఫర్ శవాలను ఫోటోలు తీస్తుండగా..ఓ శవంలోంచి శబ్దాలు వచ్చాయి. కానీ అతనుభయపడలేదు. అదంతా తన భ్రమ అనుకుని మరోసారి కెమెరాతో క్లిక్ చేద్దామనుకునే సమయంలో మరోసారి శవంలోంచి మూలుగులు వినిపించటంతో షాక్ అయ్యాడు. దీంతో అతను ఆ వ్యక్తి చనిపోలేదని..బ్రతికే ఉన్నాడేమోననే అనుమానంతో పోలీసులకు సమాచారం అందించాడు.
వివరాల్లోకి వెళితే..శివదాసన్ అనే వ్యక్తి తీవ్ర గాయాలతో అనుమానాస్పదంగా చనిపోవటంతో న్యాయవిచారణ రిపోర్టు కోసం ఎర్నాకుళం పోలీసులు మృతదేహాన్ని ఫోటోలు తీయటానికి ప్రఖ్యాత ఫోటో గ్రాఫర్ టామీ థామస్ ఫోన్ చేశారు. వెంటనే ఘటనాస్థలానికి వచ్చిన థామస్ శవాన్ని ఫోటోలు తీయటానికి శివదాసన్ ఇంటికి వెళ్లాడు. తన కెమెరాతో మృతదేహాన్ని ఫోటోలు తీస్తున్నాడు. ఇంతలో తాను ఫోటోలు తీస్తున్న శవంలోంచి శబ్దాలు వినిపించాయి. తన భ్రమ ఏమో అనుకున్నాడు. తన పని తాను చేసుకుంటు..పలు యాంగిల్స్ లో ఫోటోలు క్లిక్ క్లిక్ మనిపిస్తున్నాడు. కానీ మరోసారి శవంలోంచి శబ్దాలురావటంతో ఈ సారి చెవులు రిక్కించి ఆలకించాడు. ఆ శబ్దాలు మృతదేహం అనుకుంటున్న వ్యక్తి మూలుగులని గ్రహించాడు. అతను చనిపోలేదు..బ్రతికే ఉన్నాడని అనుమానించాడు. షాక్ అయ్యాడు. వెంటనే పోలీసులు ఆఘమేఘాల మీద ఫోన్ చేశాడు.
అంతకంటే స్పీడ్ గా శివదాసన్ ఇంటికి చేరుకున్న పోలీసులు వెంటనే మృతదేహాన్ని కాదు కాదు శివదాసన్ ను హాస్పిటల్ కు తరలించారు.ప్రస్తుతం శివదాసన్ కు త్రిసూర్‌లోని జూబ్లీ మిషన్ హాస్పిటల్ లోని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ వింత అనుభవంపై ఫోటోగ్రాఫర్ థామస్ మాట్లాడుతూ.. ‘నా 25 ఏళ్ల కెరీర్‌లో ఇటువంటి సంఘటన ఎప్పుడూ ఎదురు కాలేదు. చాలా థ్రిల్లింగ్‌గా..ఉంది. చనిపోయాడనుకున్న వ్యక్తి నా వల్ల బతికే ఉన్నారని తెలిసింది’ ఇది నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది అని థామస్ తెలిపారు.