Air chief Bhadauria on IAF Day: దేశ సార్వభౌమత్వాన్ని, ప్రయోజనాలను పరిరక్షించేందుకు భారత వైమానిక దళం సర్వసన్నద్ధంగా ఉందని IAF చీఫ్ ఆర్కేఎస్ భదౌరియా తెలిపారు. ఇవాళ(అక్టోబర్-8,2020) భారత వాయుసేన 88వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఘజియాబాద్ లోని హిండన్ ఎయిర్‌బేస్ లో జరిగిన వేడుకల్లో ఎయిర్ చీఫ్ మార్షల్ భదౌరియా పాల్గొన్నారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్, నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్‌లు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఎయిర్‌ఫోర్స్‌డేను పురస్కరించుకుని హిండన్ ఎయిర్‌బేస్‌లో వైమానిక దళం పరేడ్ నిర్వహించింది. దీనిలో వాయుసేనకు చెందిన 56 విమానాలు పాల్గొన్నాయి. తేజస్, జాగ్వర్, సుఖోయ్ సహా 19 యుద్ధ విమానాలు, 19 హెలికాప్టర్లు వీటిలో ఉన్నాయి. ఇటీవలే వైమానిక దళంలో చేరిన రఫేల్ యుద్ధ విమానాలు కూడా ఈ పరేడ్‌లో పాల్గొన్నాయి. ఎయిర్ ఫోర్స్ డే పరేడ్‌ను భదౌరియా వీక్షించారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ…శత్రువుకు దీటుగా బదులిచ్చే సత్తా తమకుందని స్పష్టం చేశారు. ఇటీవల సరిహద్దులో ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు వాయుసేన చురుగ్గా స్పందించిన తీరుకు అభినందనలు తెలిపారు. తూర్పు లఢఖ్ లో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారత సైన్యానికి అతి తక్కువ సమయంలోనే సాయం అదించి యుద్ధ సన్నద్ధతకు సహకరించడంపై ప్రశంసలు కురిపించారు.
ఐఏఎఫ్ క్రమంగా రూపాంతరం చెందుతున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పుడు మనం ఓ కొత్త శకంలోకి ప్రవేశించామన్నారు. మన వైమానిక శక్తిని, మల్టీ ఆపరేషన్లు నిర్వహించే కాలంలో ఉన్నట్లు తెలిపారు. ఈ ఏడాది చాలా అసాధారణ రీతిలో గడుస్తున్నదని, కోవిడ్ ప్రపంచం అంతా వ్యాపిస్తుంటే, మన దేశం స్థిరంగా స్పందించిందని, ఇలాంటి సమయంలో వైమానిక దళల యోధులు తమ సామర్థ్యాన్ని ప్రదర్శించినట్లు ఆయన చెప్పారు.
వాయుసేన దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు కేంద్రమంత్రులు, ప్రముఖులు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ రక్షణ కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతున్న వీరులకు కృతజ్ఞతలు తెలిపారు.