ఇక సెలవు : నిగం బోధ్ వద్ద జైట్లీ అంత్యక్రియలు

  • Publish Date - August 25, 2019 / 01:13 AM IST

కేంద్ర మాజీ ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2019, ఆగస్టు 25వ తేదీ ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీలోని నిగం బోధ్ ఘాట్ వద్ద అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ లాంఛనాలతో జైట్లీకి అంతిమ సంస్కారాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. జైట్లీ భౌతికకాయాన్ని కైలాష్ కాలనీలోని నివాసంలో ఉదయం 10 గంటల వరకు ఉంచుతారు. ఆ తర్వాత ఆయన పార్థివదేహాన్ని బీజేపీ ప్రధాన కార్యాలయానికి తీసుకువెళ్లి ప్రజా సందర్శనార్థం ఉంచుతారు. మధ్యాహ్నం 1:30 గంటలకు అరుణ్ జైట్లీ అంతిమయాత్ర ప్రారంభం కానుంది. నిగంబోధ్ ఘాట్ వరకూ అంతిమ యాత్ర నిర్వహించి… మధ్యాహ్నం రెండున్నర గంటలకు అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

విదేశీ పర్యటనలో మోడీ
అబుదాబి పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ… అరుణ్‌జైట్లీ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. అరుణ్ జైట్లీ ఒక రాజకీయ దిగ్గజమని ఆయన ఒక గొప్ప మేధావని ప్రశంసించారు. భారతదేశ అభివృద్ధికి ఆయన అందించిన సహకారం మరువలేనిదని కొనియాడారు. జైట్లీ కన్నుమూయడం చాలా బాధ కలిగించిందని అన్నారు. జైట్లీ భార్య సంగీతతో పాటు కొడుకు రోహన్‌తో మాట్లాడి వారి కుటుంబ సభ్యులకు మోడీ సానుభూతి వ్యక్తం చేశారు. అరుణ్ జైట్లీ అంత్యక్రియలకు ప్రధాని మోడీ హాజరుకాలేకపోవచ్చని తెలుస్తోంది. యూఏఈ, బహ్రెయిన్ వెళ్లిన మోడీ… షెడ్యూల్ ప్రకారం ఆదివారం కూడా అక్కడే ఉండనున్నారు. జైట్లీ మృతితో ఆయన తన పర్యటన కొనసాగిస్తారా లేదా అన్నదానిపై సందిగ్ధత నెలకొంది. విదేశీ పర్యటన రద్దు చేసుకోవద్దని.. అధికారిక కార్యక్రమాలు పూర్తి చేయాల్సిందిగా ప్రధాని మోడీని జైట్లీ కుటుంబ సభ్యులు కోరినట్టు తెలుస్తోంది.