Goa Election
Ex Goa CM Laxmikant Parsekar : ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. అధికారం నిలబెట్టుకోవాలని అధికార పార్టీ..కుర్చీని కైవసం చేసుకోవాలని ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు పన్నుతూ బిజీబిజీగా గడిపేస్తున్నాయి. ఇప్పటికే పలు పార్టీలు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో తమకు టికెట్ దక్కలేదని కొంతమంది నేతలు పార్టీలను వీడడానికి నిశ్చయించుకుంటున్నారు. గోవా మాజీ సీఎం, దివంగత మనోహర్ పారికర్ తనయుడు ఉత్పల్ పారికర్ బీజేపీకి గుడ్ బై చెప్పిన తర్వాత..మరో షాక్ తగిలింది. గోవా ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు ఛాన్స్ ఇవ్వలేదని పేర్కొంటూ…పార్టీకి రాజీనామా చేయనున్నట్లు మాజీ ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ వెల్లడించారు. దీంతో ఆ పార్టీకి చెందిన వర్గాల్లో ఆందోళన వ్యక్తమయ్యింది.
Read More : Summer Releases: స్టార్లంతా సమ్మర్ బరిలోనే.. బాక్సాఫీస్ షేక్ అవ్వడం పక్కా!
తన తండ్రి నియోజకవర్గమైన పనాజీ నుంచి పోటీ చేయాలని ఉత్పల్ పారికర్ భావించారు. కానీ ఆ సీటును ఇతరులకు ఇవ్వడంతో పార్టీకి రాజీనామా చేసిన ఆయన ఇండిపెండెంట్ గా బరిలోకి దిగాలని నిశ్చయించుకున్నారు. ఇక మాజీ సీఎం పర్సేకర్ మండ్రేమ్ అసెంబ్లీ స్థానం నుంచి 2002 నుంచి 2017 వరకు ప్రాతినిధ్యం వహించారు. 2014 నుంచి 17 వరకు గోవా ముఖ్యమంత్రిగా పని చేశారు. ప్రస్తుతం ఈయన ఎన్నికల్లో బీజేపీ మేనిఫెస్టో కమిటీ అధ్యక్షులుగా ఉన్నారు. మండ్రేమ్ అసెంబ్లీ స్థానంలో ఎమ్మెల్యే దయానంద్ సోప్టేను బరిలోకి దింపింది. దీంతో పర్సేకర్ అలకబూని పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు. మరి ఆయన్ను పార్టీ బుజ్జగిస్తుందా ? లేదా ? అనేది చూడాలి.