Atul Subhash Case : మనవడిని అప్పగించకపోతే.. కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంటాం : అతుల్ సుభాష్ తండ్రి ఆవేదన!

Atul Subhash Case : పవన్ మోదీ మాట్లాడుతూ తన మనవడిని గురించి ఆవేదన వ్యక్తం చేశారు. మనవడిని తిరిగి అప్పగించకపోతే.. తమ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుని చనిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

Atul Subhash Case : మనవడిని అప్పగించకపోతే.. కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంటాం : అతుల్ సుభాష్ తండ్రి ఆవేదన!

Atul Subhash Case (Image Source : Google )

Updated On : December 24, 2024 / 6:29 PM IST

Atul Subhash Case : బెంగళూరులో తన భార్య వేధింపుల ఆరోపణలతో ఆత్మహత్య చేసుకున్న ఏఐ ఇంజనీర్ అతుల్ సుభాష్ తండ్రి పవన్ మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు తాను ఒక్క విషయం గురించి మాత్రమే ఆందోళన చెందుతున్నానని చెప్పారు. తన మనవడు వ్యోమ్ ఎక్కడ ఉన్నాడు? అతను సురక్షితంగా ఉన్నాడో లేదో? అని అనుమానం వ్యక్తంచేశారు. బీహార్‌లోని సమస్తిపూర్‌లో నివసిస్తున్న పవన్ మోదీ మీడియాతో మాట్లాడుతూ తన మనవడిని గురించి ఆవేదన వ్యక్తం చేశారు. మనవడిని తిరిగి అప్పగించకపోతే.. తమ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుని చనిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

నా మనవడు ఎక్కడ? :
తన మనవడు వ్యోమ్ ఎక్కడ ఉన్నాడు? అతని పరిస్థితి ఏంటి అనే విషయాలపై తాత పవన్ మోదీకి ఇంకా సమాచారం అందలేదు. పోలీసుల నుంచి కూడా ఈ విషయంలో పక్కా సమాచారం అందడం లేదన్నారు. ‘పోలీసులు కావాలంటే మనవడి లొకేషన్‌ను ట్రాక్ చేయవచ్చు. కానీ, ఇప్పటి వరకు ఆ దిశగా అడుగులు వేయలేదు’ అని పవన్ మోదీ అన్నారు. తన కొడుకు అతుల్ విషయంలో జరిగినట్టుగానే మనవడి విషయంలో కూడా ఏదో తప్పు జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

జనవరి 7లోగా మనవడిని కోర్టులో హజరుపర్చాలి :
కుమారుడి ఆత్మహత్య కేసులో తనకు న్యాయం చేయాలని కోర్టును ఆశ్రయించానని, సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ కూడా పొందానని అతుల్ తండ్రి తెలిపారు. సుప్రీంకోర్టు ఈ కేసును పరిగణలోకి తీసుకుంది. ఆ చిన్నారి ఆచూకి తెలుసుకుని జనవరి 7లోగా మనవడిని కోర్టులో హాజరుపర్చాలని ఉత్తరప్రదేశ్ సహా మూడు రాష్ట్రాల డీజీపీలను కోర్టు ఆదేశించింది. అయితే దీని తరువాత కూడా ఎలాంటి కచ్చితమైన చర్యలు తీసుకోలేదు. ఈ విషయంలో చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, ముఖ్యంగా మహిళల కోసం చేసిన చట్టాలను పురుషులపై తప్పుగా ప్రయోగిస్తున్నారని పవన్ మోదీ అభిప్రాయపడ్డారు.

ఇది మొత్తం సమాజానికి పెద్ద సమస్యగా మారిందని, ఇప్పుడు పురుషులు తమ అభిప్రాయాలను వెల్లడించే అవకాశం లేదని ఆయన అన్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి మనవడికి భద్రత, రక్షణ కల్పించాలని అతుల్ తండ్రి విజ్ఞప్తి చేశారు. “నా మనవడు సురక్షితంగా ఉండాలని, సంతోషకరమైన జీవితాన్ని గడపాలని నేను కోరుకుంటున్నాను” అని అతుత్ తండ్రి చెప్పారు. ప్రధాని, రాష్ట్రపతి నుంచి కూడా సాయం అందుతుందని ఆశిస్తున్నానని పవన్ మోదీ అన్నారు.

ఆ తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదు : అతుల్ సోదరుడు 
ఈ విషయమై అతుల్ సోదరుడు వికాస్ మాట్లాడుతూ.. పూసా, సమస్తిపూర్‌లో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదైనట్టు తెలిపారు. అయితే, ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదని ఆయన చెప్పారు. “ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేందుకు మేం చాలా రోజులు వేచి ఉండాల్సి వచ్చింది. చివరికి, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్, డిస్ట్రిక్ట్ కమీషనర్ జోక్యం తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు అయింది. ఇన్ని రోజుల తర్వాత ఎందుకు చర్యలు తీసుకున్నారని వికాస్ ప్రశ్నలను లేవనెత్తారు.

బెంగళూరులోని ఓ ఆటోమొబైల్ కంపెనీలో పనిచేస్తున్న అతుల్ సుభాష్ విడాకుల సెటిల్మెంట్ కోసం తన భార్య, కుటుంబ సభ్యులు రూ.3 కోట్లు డిమాండ్ చేయడంతో డిసెంబర్ 9న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. టెక్కీ అతుల్ 90 నిమిషాల వీడియోతో పాటు 40 పేజీల డెత్ నోట్‌ రాశాడు. అందులో తన భార్య నికితా సింఘానియా, ఆమె కుటుంబ సభ్యుల వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా వీడియోలో వివరించారు.

Read Also : WhatsApp Android Phones : వాట్సాప్ యూజర్లకు అలర్ట్.. 2025 జనవరి నుంచి ఈ ఆండ్రాయిడ్ ఫోన్‌లలో పనిచేయదు.. ఫోన్ల ఫుల్ లిస్టు..!