ఆవులను తాకట్టుపెట్టుకుని బంగారం లోన్ ఇప్పించండి బాబయ్యా..

‘భారతీయ ఆవు పాలల్లో బంగారం ఉంటుందని’ కొద్ది రోజుల క్రితం భాజపా నాయకుడు దిలీప్ ఘోష్ వ్యాఖ్యలు చేసింది తెలిసిందే. ఆ మాటలను నమ్మేసిన ఓ వ్యక్తి తన రెండు ఆవులను తాకట్టు పెట్టుకొని రుణం మంజూరు చేయమని అడుగుతున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ బంగాల్‌లోని దంకుని ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన రెండు ఆవులను తీసుకుని మణప్పురం ఫైనాన్స్‌కు వెళ్లాడు.
బంగారంపై రుణం తీసుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు. అందుకు గానూ తన రెండు ఆవులను తాకట్టు పెట్టుకోవాలని అక్కడి సిబ్బందికి తెలిపాడు. ఎందుకంటే ఆవు పాలల్లో బంగారం ఉందని విన్నాను. నాకు 20 ఆవులు ఉన్నాయి. ఈ రెండిటిని మీరు తాకట్టు పెట్టుకొని రుణం ఇస్తే నా వ్యాపారాన్ని విస్తరించగలను అని సదరు వ్యక్తి తెలిపాడు.
మరోవైపు గరల్‌గచ గ్రామ సర్పంచ్ మనోజ్ సింగ్ దిలీప్ ఘోష్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. నిత్యం తన వద్దకు ఎంతో మంది ప్రజలు వచ్చి తమ ఆవులపై ఎంత రుణం ఇస్తారని అడుగుతున్నారని తెలిపారు. అంతేకాకుండా ఆవుపాలలో బంగారం ఉంటుందని తెలిపిన దిలీప్ ఘోష్‌కు నోబెల్ బహుమతి ఇవ్వొచ్చు అంటూ ఎద్దేవా చేశారు.
బుర్ధ్వాన్ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో దిలీప్ ఘోష్ మాట్లాడుతూ… ‘మన ఆవులకు మూపురాలు ఉన్నాయి, అవి విదేశీ ఆవులకు లేవు. మూపురం ధమని ఉంది. దీన్ని బంగారు ధమని అని పిలుస్తారు. సూర్యరశ్మి దానిపై పడినప్పుడు బంగారం తయారవుతుంది’ అని చెప్పుకొచ్చారు.