×
Ad

Gali Janardhan Reddy : బళ్లారిలో టెన్షన్ టెన్షన్.. గాలి జనార్దన్ రెడ్డి ఇల్లు తగలబెట్టిన దుండగులు

Gali Janardhan Reddy : బళ్లారి శివార్లలో రూ.3కోట్ల విలువైన గాలి జనార్దన్ రెడ్డి మోడల్ హౌస్ కు నిప్పుపెట్టడం కర్ణాటకలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Gali Janardhan Reddy

Gali Janardhan Reddy : మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డికి చెందిన బళ్లారిలోని కంటోన్మెంట్ ఏరియాలో గల మోడల్ హౌస్‌కు గుర్తుతెలియని దుండగులు నిప్పుపెట్టారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది. ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో జనార్దన్ రెడ్డి బెంగళూరులో ఉన్నారు.

Also Read : Gold and Silver Rates Today : ఒక్కరోజులోనే బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు.. లేటెస్ట్ ధరలు ఇలా!

బళ్లారి నగరంలోని జీ స్వ్కేర్ లే అవుట్ లోఉన్నమోడల్ హౌస్ విలువ సుమారు రూ.3కోట్లు ఉంటుందని అంచనా. 13ఏళ్ల క్రితం కొనుగోలుదారులను ఆకర్షించేందుకు దీనిని నిర్మించారు. అయితే, ఈ మోడల్ హౌస్‌కు నిప్పుపెట్టడం కర్ణాటకలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గుర్తుతెలియని దుండగులు ఇంటి కిటికీలు, తలుపులు పగులగొట్టి పెట్రోల్ పోసి దహనం చేయడంతో ఫర్నీచర్ కాలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలికి చేరుకొని మంటలను అదుపుచేశారు. అయితే, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది.

ఈ ఘటన వెనుక బళ్లారి కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి ప్రమేయం ఉందని గాలి జనార్దన్ రెడ్డి సోదరుడు సోమశేఖర్ రెడ్డి ఆరోపించారు. తాజా ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటనపై బెంగళూరులో ఉన్న గాలి జనార్దన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇటీవల బ్యానర్ల వివాదం తలెత్తిన నేపథ్యంలోనే ఈ అగ్నిప్రమాదం జరగడం పలు అనుమానాలకు తావునిస్తోందని అన్నారు. బళ్లారి ఎస్పీతో మాట్లాడాను.. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని కోరానని ఆయన మీడియాకు తెలిపారు.

ఇదిలాఉంటే.. కొద్దిరోజుల క్రితం గాలి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద బ్యానర్ల ఏర్పాటు విషయంపై ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి వర్గీయులు కాల్పులకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. ఈ వివాదం సర్దుమణగక ముందే ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి మోడల్ హౌస్‌కు నిప్పుపెట్టడం కర్ణాటకలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.