మొదటిసారిగా…త్రివర్ణమయమైన కేరళ మసీదులు

రిపబ్లిక్ డే సందర్భంగా ఆదివారం(జనవరి-26,2020) కేరళలలో సరికొత్త దృశ్యం ఆవిష్కృతమైంది. రాష్ట్రంలోని అన్ని మసీదుల్లో కేరళ ముస్లిం వక్ఫ్‌ బోర్డు ఆధ్వర్యంలో ఆదివారాన్ని రాజ్యాంగ పరిరక్షణ రోజుగా పేర్కొంటూ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించబడ్డాయి. ఇలా కేరళలోని దాదాపు 10వేల మసీదుల్లో అధికారికంగా జాతీయ పండగ జరుపుకోవడం ఇదే మొదటిసారి. దీంతో మసీదులన్ని మూడు రంగుల జెండా అలంకరణతో కొత్త శోభను సంతరించుకున్నాయి.

జెండా ఆవిష్కరణ అనంతరం మసీదుల్లో భారత రాజ్యాంగా పీఠికను చదివారు. ముస్లింలు తమ మసీదుల్లో జాతీయా జెండాను ఎగురవేసి.. జాతీయా సమైక్యతను ప్రోత్సహించాలనే సందేశాన్ని ఇచ్చారు. జాతీయ జెండాను గౌరవిస్తూ.. దేశ రాజ్యాంగాన్ని పరిరక్షించాలని ముస్లింలు ప్రతిజ్ఞ చేశారు. ఇటీవల కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం,ప్రతిపాదిత ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కొంతకాలంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.

దేశవ్యాప్తంగా ముస్లింలు సీఏఏ,ఎన్ ఆర్సీలకు వ్యతిరేకంగా గళమెత్తుతున్న ఈ సమయంలో కేరళలోని మసీదుల్లో గణతంత్ర వేడుకలు నిర్వహించడం విశేషం. మరోవైపు సీఏఏకి వ్యతిరేకంగా కేరళలో ఇవాళ 620కీలోమీటర్ల మేర భారీ మానవహారం చేపట్టింది ఎల్డీఎఫ్ ప్రభుత్వం. నార్త్ కేరళలోని కసర్ గోడ్ నుంచి దక్షిణభాగంలోని కలియక్కవిలై వరకు దీనిని నిర్వహించారు.

సీనియర్ సీపీఎం నాయకుడు ఎస్ రామచంద్రన్ కాసర గోడ్ దగ్గర మొదటగా నిలబడగా..కలియక్క విలైలో ఏంఏ బేబీ చివరగా నిలబడ్డారు. దాదాపు ఏడు మిలియన్ల మంది ప్రజలు ఇందులో పాల్గొన్నారు. సీఎం పినరయి విజయన్ కూడా పాల్గొని తమ నిరసనను తెలియచెప్పారు. అంతేకాకుండా సీఏఏను తమ రాష్ట్రంలో అమలు చేసేది లేదని కేరళ అసెంబ్లీ ఇప్పటికే తీర్మానం కూడా చేసిన విషయం తెలిసిందే.

 

ట్రెండింగ్ వార్తలు