అయోధ్య తీర్పు ఇచ్చిన రంజన్ గోగోయ్‌కి రాజ్యసభ

  • Publish Date - March 16, 2020 / 05:44 PM IST

భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించిన జస్టిస్ రంజన్ గోగోయ్.. ఇటీవల తన పదవికాలం పూర్తి చేసుకుని పదవీ విరమణ చేశారు. ఈశాన్య భారతం నుంచి సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ పదవికి ఎంపికైన తొలి వ్యక్తి రంజన్ గోగోయ్ కాగా తండ్రి కేశవ్ చంద్ర గోగోయ్ గతంలో అసోమ్ ముఖ్యమంత్రిగా సేవలందించారు.

1978లో గొగోయ్‌ బార్‌ కౌన్సిల్‌లో చేరి లాయర్‌గా గౌహతి హైకోర్టులో ప్రాక్టీస్‌ చేసిన ఆయన.. 2001 ఫిబ్రవరి 28న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులైయ్యారు. జస్టిస్‌ గొగోయ్‌ 2012 ఏప్రిల్‌లో సర్వోన్నత న్యాయస్థానంలో పదోన్నతి పొందారు. భారత 46వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ కొనసాగారు.

రెండున్నర దశాబ్ధాలకు పైగా పెండింగ్‌లో ఉన్న అయోధ్య కేసు.. 134 సంవత్సరాలుగా వివాదంలో ఉన్న రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూమి. దేశంలోని కోట్లాది మంది హిందువులు, ముస్లింల మనోభావాలతో ముడిపడిన కేసులో ఆయన తీర్పు ఇచ్చారు. అనంతరం 2019 నవంబర్ 17న సుప్రీంకోర్టు నుంచి పదవీ విరమణ  పొందారు రంజన్ గోగోయ్.

Also Read | ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ సందేశాలు: కరోనాని జయించాలి

అయితే ఇప్పుడు రంజన్ గోగోయ్.. రాజ్యసభకు వెళ్లబోతున్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సోమవారం(16 మార్చి 2020) రంజన్ గొగోయ్‌ను రాజ్యసభకు నామినేట్ చేశారు. రాఫెల్ ఒప్పందంపై దర్యాప్తును సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న రంజన్ గోగోయ్ రెండుసార్లు తోసిపుచ్చారు.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 80లోని క్లాజ్ (1)లోని నిబంధన ప్రకారం రంఃజన్ గోగోయ్ ని రాష్ట్రపతి నామినేట్ చేశారు. అంతకుముందు రాష్ట్రపతి నామినేట్ చేసిన వ్యక్తులలో ఒకరి పదవీకాలం పూర్తికాగా ఇప్పుడు రంజన్ గోగోయ్ ని అందులో భర్తీ చేశారు.