Sharad Yadav Death: జేడీయూ మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్ కన్నుమూత.. ప్రధాని మోదీ సహా ప్రముఖుల సంతాపం..

జేడీ-యూ మాజీ అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి శరద్‌ యాదవ్‌ (75) గురువారం రాత్రి కన్నుమూశారు. నివాసంలోనే కుప్పకూలి స్పృహ కోల్పోయిన స్థితిలో ఉన్న ఆయన్ని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఏడుసార్లు లోక్‌సభకు, మూడుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Sharad Yadav Death: కేంద్ర మాజీ మంత్రి, జేడీయూ మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్ (75) గురువారం రాత్రి కన్నుమూశారు. ఛతర్‌పూర్‌లోని నివాసంలోనే కుప్పకూలి స్పృహ కోల్పోయిన స్థితిలో ఉన్న ఆయన్ను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లు గురుగ్రామ్‌లోని ఫోర్టిస్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. చాలాకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. క్రమతప్పకుండా డయాలసిస్ చేయించుకునేవాడు. బీహార్ రాజకీయాల్లో శరద్ యాదవ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. శరద్ యాదవ్ పార్ధివ దేహాన్ని న్యూ ఢిల్లీ ఛతర్‌పూర్‌లోని 5ఎ వెస్ట్రన్ నివాసంలో అభిమానులు, బంధుమిత్రుల సందర్శనార్ధం రోజంతా ఉంచుతారు.

 

శరద్ యాదవ్ మృతివార్తను ఆయన కుమార్తె సుభాషిణి తెలియజేశారు. ట్విటర్‌లో సంతాపం తెలిపారు. తన తండ్రి ఇకలేరని పేర్కొన్నారు. గురువారం రాత్రి 10.19గంటల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారని తెలిపారు. శరద్ యాదవ్‌కు భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన మృతికి ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం కేసీఆర్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్, బీహార్ సీఎం నితీష్ కుమార్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్, అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ నేత రాజీవ్ శుక్లా, తదితరులు సంతాపం తెలియజేశారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

 

శరద్ యాదవ్ మధ్యప్రదేశ్ లోని హోషంగాబాద్ లోని ఓ గ్రామంలో 1947లో జన్మించారు. 1971లో ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసుకున్నారు. డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఆలోచనల స్ఫూర్తితో చురుకైన యువ నాయకుడిగా శరద్ యాదవ్ అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. 1974లో క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. తొలిసారి మధ్యప్రదేశ్ లోని జబల్‌పుర్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఏడుసార్లు లోక్ సభకు, మూడుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1999 నుంచి 2004 మధ్య అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు.

 

2023లో జేడీ-యూ (జనతాదళ్ యునైటెడ్) ఆవిర్భవించాక తొలి జాతీయ అధ్యక్షునిగా ఎన్నికైన ఆయన 2016 వరకు ఆ పదవిలో కొనసాగారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని కోల్పోవాల్సి వచ్చింది. పార్టీలో పదవుల నుంచి ఆయన్ను తొలగించారు. అయితే, 2018లో లోక్ తాంత్రిక్ జనతాదళ్ పార్టీని సొతంగా ఏర్పాటు చేసుకొని, 2020 మార్చిలో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)లో దానిని విలీనం చేశారు. ప్రస్తుతం ఆయన కుమార్తె సుభాషిణి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అయితే, ఆయన అంత్యక్రియలు మధ్యప్రదేశ్ లోని హోషంగాబాద్ లో శనివారం జరిగే అవకాశం ఉంది.

ట్రెండింగ్ వార్తలు