Four Member Panel Set Up To Look Into Deaths Due To Shortage Of Oxygen During Second Wave
Four-member Panel Oxygen Deaths : కొవిడ్-19 మహమ్మారి సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్ కొరత వల్ల కొవిడ్ మరణాలను పరిశీలించేందుకు ఢిల్లీ ప్రభుత్వం నలుగురు సభ్యుల నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీపై లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం కోసం వేచి చూస్తున్నామని డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తెలిపారు.
కరోనావైరస్ సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ సంక్షోభం తలెత్తింది. ఆక్సిజన్ కొరత కారణంగా కొన్నిఆస్పత్రుల్లో కరోనా బాధితుల మరణాలకు దారితీసిందంటూ వార్తలు వచ్చాయని సిసోడియా తెలిపారు. ఈ సమస్యను తీవ్రంగా పరిగణించినట్టు ఆయన వెల్లడించారు.
దీనిపై లోతుగా పరిశీలించేందుకు వైద్య నిపుణులతో కూడిన నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఎల్జీ ఆమోదం కోసం ఫైల్ పంపించామని ఆయన చెప్పారు. ఈ కమిటీ వారానికి రెండుసార్లు సమావేశం కానుంది.
ప్రతి కేసును పరిశీలించి, ఆక్సిజన్ గ్యాస్ కొరత కారణంగా మరణాలు సంభవించాయా లేదో నిర్ణయిస్తుంది. ఎల్‌జీ ఫైల్‌ను ఆమోదించిన వెంటనే, ఈ కమిటీ పరిశీలన ప్రారంభిస్తుందని ఆయన చెప్పారు. ఆక్సిజన్ కొరత కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.