Rajasthan
Rajasthan Dausa : రాజస్థాన్ లో ఎన్నికల వేళ దారుణ ఘటన చోటు చేసుకుంది. దౌసా జిల్లా లాల్ సౌట్ ప్రాంతంలో ఏఎస్ఐ నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారంకు పాల్పడటం స్థానికంగా ఉద్రిక్తతలకు దారితీసింది. పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ భూపేంద్ర సింగ్ శుక్రవారం మధ్యాహ్నం ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఆగ్రహానికి లోనైన స్థానికులు ఏఎస్ఐపై దాడికి పాల్పడ్డారు. అనంతరం నిందితుడిని పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రహువాస్ పోలీస్ స్టేషన్ వద్ద భారీ సంఖ్యలో స్థానికులు ఆందోళనకు దిగారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే నిందితుడిని విధుల నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాక అత్యాచార బాధితురాలి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. బాలికపై అత్యాచారంకు పాల్పడ్డ ఏఎస్ఐను అరెస్టు చేసి పోలీసులు విచారిస్తున్నారు.
Also Read : Delhi-Jaipur Highway : కారు, వ్యాన్లను ఢీకొన్న ఆయిల్ ట్యాంకర్…నలుగురి మృతి
ఈ ఘటనపై రాజస్థాన్ డీజీసీ ఉమేష్ మిశ్రా మాట్లాడుతూ.. నిందితుడైన ఏఎస్ఐ భూపేంద్ర సింగ్ పై కఠిన చర్యలు తీసుకుంటామని, త్వరలో అతన్ని ఉద్యోగం నుంచి తొలగిస్తామని చెప్పారు. పోలీసులు బాధితురాలి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటారని, వారికి సహాయం అందిస్తామని తెలిపారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏఎస్ఐ భూపేంద్ర సింగ్ ఎన్నికల విధుల్లో భాగంగా రహువాస్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నాడు. దీంతో అదే గ్రామంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం అతని గది దగ్గర ఆడుకుంటూ నాలుగు సంవత్సరాల చిన్నారి వచ్చింది. ఆ చిన్నారిని భూపేంద్ర సింగ్ పిలిచి గదిలోకి తీసుకెళ్లాడు. బాలికపై అత్యాచారంకు పాల్పడ్డాడని స్థానికులు ఆరోపించారు.
ఈ ఘటనపై రాజస్థాన్ ఆరోగ్య శాఖ మంత్రి పర్సాది లాల్ మీనా స్పందిస్తూ.. చిన్నారిపై అత్యాచారంకు పాల్పడిన ఏఎస్ఐ ను అరెస్టు చేశారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించేందుకు సీఎంతో చర్చలు జరుపుతామని చెప్పారు. ఈ ఘటనపై బీజేపీ నేత, కేంద్ర మంత్రి ప్రహల్లాద్ జోషి మాట్లాడుతూ.. రాజస్థాన్ లో అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థత కారణంగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై రాజస్థాన్ బీజేపీ చీఫ్ సీపీ జోషి మాట్లాడుతూ.. ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హోదాకలిగిన పోస్టులో ఉండి ఓ జంతువులా ప్రవర్తించిన వ్యక్తిపై ప్రభుత్వం, పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు.