Supreme Court Representative Image (Image Credit To Original Source)
Supreme Court: బాలికల జీవించే హక్కు, గౌరవం, ఆరోగ్యం, విద్యలో రుతుక్రమ పరిశుభ్రత (Menstrual health) ఒక అంతర్భాగమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. స్కూల్ (ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్) అమ్మాయిలందరికీ బయో డీగ్రేడబుల్ శానిటరీ ప్యాడ్స్ ఉచితంగా అందేలా చూడాలంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చింది. అలాగే ప్రతి స్కూల్లో అమ్మాయిలు, అబ్బాయిలకు వేర్వేరుగా టాయిలెట్స్ ఉండాలంది. అంతేకాదు అవి దివ్యాంగులకూ అనుకూలంగా ఉండాలని సూచించింది. ఒకవేళ ప్రైవేట్ స్కూల్స్ ఇవి పాటించకపోతే వాటి గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సమగ్రమైన తప్పనిసరి ఆదేశాలను జారీ చేసింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ఋతుస్రావ పరిశుభ్రత (Menstrual health) హక్కు.. జీవించే హక్కు, గోప్యతా హక్కులో అంతర్భాగం అని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. బాలికలు, మహిళలకు గౌరవం, ఆరోగ్యం, సమానత్వాన్ని నిర్ధారించడానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, పాఠశాలలకు ఆదేశాలు జారీ చేసింది. న్యాయమూర్తులు జె.బి. పార్దివాలా, ఆర్.మహదేవన్ ల ధర్మాసనం ఈ ఉత్తర్వు ఇచ్చింది. స్కూల్ విద్యార్థినులకు ఉచిత శానిటరీ ప్యాడ్లు, తిగినంత పారిశుధ్య సౌకర్యాలను కోరుతూ దాఖలైన పిటిషన్ పై తన తీర్పును ప్రకటిస్తూ, అన్ని స్కూల్స్ లో బాలికలకు బయోడిగ్రేడబుల్ శానిటరీ న్యాప్కిన్లను ఉచితంగా అందించాలని సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది.
ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు రెండూ ఈ నిబంధన పాటించడం తప్పనిసరి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రైవేట్ స్కూల్స్ లో అమ్మాయిలు, అబ్బాయిలకు వేర్వేరు టాయిలెట్లను ఏర్పాటు చేయడంలో విఫలమైనా, విద్యార్థులకు ఉచిత శానిటరీ ప్యాడ్‌లను పొందేలా చూడకపోయినా ఆ స్కూల్ గుర్తింపు రద్దు చేయవచ్చని హెచ్చరించింది.
రుతు పరిశుభ్రతను (Menstrual health) పొందడం అనేది దాతృత్వం లేదా విధానపరమైన విచక్షణకు సంబంధించిన విషయం కాదని, గౌరవంగా శారీరక స్వయంప్రతిపత్తితో జీవించే హక్కు నుండి ప్రవహించే రాజ్యాంగ హక్కు అని ధర్మాసనం పేర్కొంది. బాలికలకు సెపరేగ్ టాయిలెట్లు, ఉచిత శానిటరీ ప్యాడ్‌లను అందించడంలో విఫలమైతే ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచుతామని అత్యున్నత న్యాయస్థానం హెచ్చరించింది. ప్రాథమిక సౌకర్యాలు లేకపోవడం, ఋతుస్రావం చుట్టూ ఉన్న కళంకం బాలికల ఆరోగ్యం, విద్య, గోప్యతను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుందని కోర్టు గమనించింది.
గత ఏడాది నవంబర్‌లో హర్యానాలోని మహర్షి దయానంద్ విశ్వవిద్యాలయంలో ముగ్గురు మహిళా పారిశుధ్య కార్మికులు రుతుక్రమంలో ఉన్నారని నిరూపించడానికి వారి శానిటరీ ప్యాడ్‌ల ఫోటోలను పంపమని బలవంతం చేసిన సంఘటనను కోర్టు పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఈ తీర్పు వెలువడింది. ఈ సంఘటన “పీరియడ్-షేమింగ్”పై దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది.