ట్రంప్ వ్యాఖ్యలపై గాంధీ మనుమడు అభ్యంతరం

  • Publish Date - September 30, 2019 / 09:16 AM IST

ప్రధాని నరేంద్ర మోడీని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జాతిపిత అని పిలవడంపై మహాత్మాగాంధీ మనవడు తుషార్‌ గాంధీ తీవ్ర అభ్యంతరం వ్యక్త చేశారు. జార్జ్ వాషింగ్టన్ స్థానంలో ట్రంప్ తనను తాను నిలుపుకోడానికి ఒప్పుకుంటారా అని కూడా ప్రశ్నించారు. కాగా..అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని నరేంద్ర మోడీని జాతిపిత అంటూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో తుషార్ గాంధీ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ..జాతిపిత మహాత్మా గాంధీ స్థానాన్ని వేరేరొకరు భర్తీ చేయటం సరైంది కాదనీ..అది వారి విజ్నతకే వదిలేస్తున్నానని తుషార్ గాంధీ అన్నారు.  అమెరికా జాతిపిత జార్జ్ వాషింగస్టన్ స్థానాన్ని ట్రంప్ భర్తీ చేసేందుకు ఇష్టపడుతున్నారేమో అని ఎద్దేవా చేశారు. 

ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోడీలు భేటీ అయ్యారు. ఈ భేటీలో దేశాధినేతలు ఒకరిపై ఒకరు పొగడ్తల వర్షం కురిపించుకున్నారు. ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోడీని జాతిపిత గాంధీతో పోల్చారు. దీనిపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. 

ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. మోడీని పొగిడేందుకు భారత జాతిపిత మహాత్మగాంధీని అవమానించాడన్నారు. చదువురాని డొనాల్డ్ ట్రంప్ భారత చరిత్ర గురించి ఏమీ తెలియకుండానే స్పందించాడని అమెరికా ప్రెసిడెంట్ భారత గౌరవాన్ని భంగపరిచాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. ట్రంప్‌కు స్వాతంత్ర్య పోరాటం గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారు? అంటూ విమర్శించారు. మహాత్మగాంధీతో మోడీకి పోలికా అంటే ప్రశ్నించారు. ఇలా ట్రంప్ వ్యాఖ్యలపై పలువురు మండిపడుతున్నారు.