Ganesh Temple Decorate Currency Notes : గణనాథుడిపై భక్తులు వినూత్న రీతిలో తమ భక్తిని చాటుకుంటున్నారు. కొందరు గణేష్ ను వినూత్నంగా ఉండేలా చూసుకుంటారు. మరికొందరు గణేష్ మండపాన్ని సరికొత్తగా అలంకరించుకుంటారు. కర్ణాటకలోని బెంగళూరులో శ్రీ సత్య గణపతి ఆలయంలో నిర్వహకులు గణేషుడి నవరాత్రులను నిత్య నూతనంగా నిర్వహిస్తూవుంటారు.
ఏటా కొత్త దనాన్ని చూపించే నిర్వహకులు ఈ ఏడాది తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఆలయాన్ని వందల కొద్ది నాణేలు, కరెన్సీ నోట్లతో అలంకరించారు. వాటి విలువ రూ.65 లక్షలు ఉంటుంది. అందులో రూ.10 నుంచి రూ.500 వరకు నోట్లు ఉన్నాయి. వివిధ ఆకృతుల్లో ఆలయాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేశారు.
గత కొన్నేళ్లుగా గణేష్ నవ రాత్రులకు ఆలయాన్ని పర్యావరణ హితంగా అలంకరిస్తూ వస్తున్నారు. ఈ సందర్భంగా పూలు, మొక్కజొన్న, అరటి కాయలు, రక రకాల పండ్లను ఉపయోగిస్తున్నారు. ఈ సారి అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఆలయ అలంకరణకు కరెన్సీ నోట్లను వినియోగించడం విశేషంగా చెప్పవచ్చు.