మోడీని జనరల్ డయ్యర్ తో పోల్చిన ఆప్

ప్రధానమంత్రి నరేంద్రమోడీని “జనరల్ డయ్యర్ మోడీ” అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ సంబోధించింది.ఆప్ అధికార ట్విట్టర్ లో చేసిన ఈ ట్వీట్‌ ను ఆ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రీట్వీట్ చేశారు. శనివారం(ఏప్రిల్-13,2019)ఢిల్లీలోని మయాపురిలో ప్రజలపై పోలీసులు రాళ్లు రువ్విన ఘటనను ఖండిస్తూ కేజ్రీవాల్ ఈ ట్వీట్ చేశారు. సరిగ్గా వందేళ్ల క్రితం జలియన్ వాలాబాగ్ లో బ్రిటీష్ ప్రభుత్వం తీసుకొచ్చిన రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా శాంతియుత నిరసన చేస్తున్న భారతీయులపై జనరల్ డయ్యర్ ఆదేశాలతో బ్రిటీష్ సైన్యం కాల్పులు జరిపి 1000మంది ప్రాణాలు బలిగొన్న విషయం తెలిసిందే.ఈ హింసాకాండకు ఆదేశాలిచ్చిన జనరల్ డయ్యర్ తో మోడీని పోల్చింది ఆప్.

850 ఫ్యాక్టరీలను మూసేయాలంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(జాతీయ హరిత ధర్మాసనం)ఇచ్చిన ఆదేశాల ప్రకారం…శనివారం(ఏప్రిల్-13,2019) కొన్ని ఫ్యాక్టరీలను సీల్ చేసేందుకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) అధికారులు ప్రయత్నించడంతో మయాపురి ఏరియాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. స్థానికులకు,సెక్యూరిటీ ఫోర్స్ మధ్య  ఘర్షణ చెలరేగింది. ఈ ఘటన గురించి కేజ్రీవాల్ ట్వీట్ చేస్తూ… ‘జనరల్ డయ్యర్ మోడీ’ పోలీసులు మయాపూరిలో ప్రజలపై రాళ్లు రువ్వారంటూ మండిపడ్డారు.దీనికి సంబంధించి వీడియాను కూడా ఆయన షేర్ చేశారు.