సిబల్ కు రాథోడ్ కౌంటర్: ఆధారాలు కావాలంటే..బాలాకోట్ వెళ్లండి

పాక్ లోని బాలాకోట్ లోని జైషే ఉగ్రశిబిరాలపై భారత వాయుసేన జరిపిన దాడులకు సంబంధించిన ఆధారాలు చూపించాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి రాజ్యవర్థన్ రాథోడ్ తీవ్రంగా మండిపడ్డారు.  భారత వైమానిక దళం ఉగ్రశిబిరాలపై దాడులు చేసిందో లేదో తెలియాలంటే బాలాకోట్ కి వెళ్లి చూడాలని సిబల్ కు ఘాలు రిప్తై ఇచ్చారు రాథోడ్. మన సొంత నిఘా వర్గాల కన్నా సిబల్ అంతర్జాతీయ మీడియాను ఎక్కువగా నమ్ముతారని ఆయన అన్నారు.

భారత్ చేసిన ఎయిర్ స్ట్రైక్స్ తో ఎలాంటి నష్టం జరగలేదని అంతర్జాతీయ మీడియా చేస్తున్న ప్రచారం సిబల్ కు చాలా ఆనందాన్ని కలిగిస్తుందని అన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయబడ్డాయని   బ్రిటన్ వెళ్లి అక్కడ ఆధారాలున్నాయంటూ తమపై ఆరోపణలు చేశారని, ఇప్పుడు బాలాకోట్ కూడా వెళ్లి చెక్ చేయాలని సిబల్ కు రాథోడ్ విజ్ణప్తి చేశారు. బాలాకోట్ దాడులపై అధికార,విపక్షాల మధ్య కొన్ని రోజులుగా మాటల యుద్ధం కొనసాగుతుంది. ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారో లెక్క చెప్పాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.