ప్రాణం తీసిన కరెంటు బిల్లు గొడవ.. ప్రియాంక అనే యువతి మృతి

మూడు రోజుల నుంచి ఇంట్లో కరెంటు బిల్లు విషయంలో గొడవలు జరుగుతున్నాయని ప్రియాంక..

ప్రాణం తీసిన కరెంటు బిల్లు గొడవ.. ప్రియాంక అనే యువతి మృతి

బిహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లా మిర్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుర్వానియా గ్రామంలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. చిన్న గొడవ వివాహిత ప్రాణం తీసింది. కరెంట్ బిల్లు కట్టలేదని అత్తమామలే ఆమెను చంపేశారంటూ మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. సుర్వనియా గ్రామానికి చెందిన తారకేశ్వర్ యాదవ్‌తో జంసాద్ గ్రామానికి చెందిన ప్రియాంకకు కొన్నేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు. ప్రియాంక భర్త విదేశాలకు వెళ్లి పనిచేస్తున్నాడు. అత్త మామాలతో కలిసి ప్రియాంక, పిల్లలు ఒకే ఇంట్లో నివసిస్తున్నారు.

గత మూడు రోజుల నుంచి ఇంట్లో కరెంటు బిల్లు విషయంలో గొడవలు జరుగుతున్నాయని ప్రియాంక తనకు ఫోన్ చేసి చెప్పిందని ఆమె తండ్రి ఆరోపించారు. ఇదే విషయం గురించి ప్రియాంక భర్త తన మామకి ఫోన్‌ చేసి చెప్పాడు. ఇంట్లో గొడవలు జరుగుతున్నట్లు ప్రియాంక తండ్రికి తెలిపాడు. ప్రియాంక ఇంటికి ఆమె తండ్రి చేరుకునే సరికి ఇంట్లో బెడ్‌పై ఆమె మృతదేహం పడి ఉంది.

స్థానిక పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సదర్‌ ఆస్పత్రికి తరలించి, కేసులో దర్యాప్తు ప్రారంభించారు. వివాహానంతరం ప్రియాంక ఎక్కువగా తన తల్లి ఇంట్లోనే ఉండేదని మృతురాలి తండ్రి తెలిపారు. అయితే, గత వారమే ఆమె అత్తమామల ఇంటికి వెళ్లింది. కరెంటు బిల్లు కట్టాలంటూ ఆమెపై ఒత్తిడి తెచ్చారని, అందుకు ఆమె నిరాకరించడంతో దారుణంగా చంపేశారని ఆమె తండ్రి ఆరోపణలు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే ప్రియాంక మృతికి కారణాలు తెలుస్తాయని పోలీసులు అంటున్నారు.

Read Also: పెళ్లి జరిగి రెండేళ్లు దాటినా భర్త తనను ముట్టుకోవట్లేదని భార్య ఏం చేసిందో తెలుసా?