దివ్యాంగులను పెళ్లి చేసుకుంటే రూ.2.5లక్షలు, ప్రోత్సాహక నగదుని భారీగా పెంచిన ప్రభుత్వం

Incentive To Marry A Person With Disabilities: ఈ రోజుల్లో దేహంలోని అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నవారికే పెళ్లి జరగడం గగనంగా మారింది. అలాంటిది వైకల్యం ఉన్న వారి పరిస్థితి చెప్పక్కర్లేదు. అవయవ లోపం ఉన్నవారిని వివాహం చేసుకోవడానికి ముందుకొచ్చే వారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ కారణంగా దివ్యాంగుల పెళ్లి జరగడం కొంత కష్టమే.

ఈ క్రమంలో సకలాంగులు దివ్యాంగులను వివాహం చేసుకుంటే.. వారికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోంది. పలు రాష్ట్రాల్లో ఈ స్కీమ్ అమల్లో ఉంది. ఈ విషయంలో ఒడిశా ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఈ స్కీమ్ లో ఇచ్చే ప్రోత్సాహక నగదుని భారీగా పెంచింది. గతంలో 50వేలు ఇచ్చేవారు. ఇప్పుడా మొత్తాన్ని రూ.2.5లక్షలకు పెంచారు.

అత్యధిక నగదు ప్రోత్సాహకాన్ని చెల్లించే రాష్ట్రంగా ఒడిషా:
ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం లేఖ రాసింది. దివ్యాంగులతో సకలాంగుల పెళ్లిళ్లను ప్రోత్సహించేలా మార్గదర్శకాల్లో మార్పులు చేసింది. కాగా, కట్న రహితంగా పెళ్లిళ్లు జరగాలని స్పష్టం చేసింది. ఈ ప్రకటనతో దేశంలోనే అత్యధిక నగదు ప్రోత్సాహకాన్ని చెల్లించే రాష్ట్రంగా ఒడిషా నిలిచింది.

వివాహాలను ప్రోత్సహించేందుకు నగదు సాయం:
దివ్యాంగులను వివిధ రంగాల్లో ప్రోత్సహించేందుకు.. వారు స్వయం శక్తితో ఎదిగేందుకు.. ఆర్థిక సహకారం అందించేందుకు పలు రాష్ట్రాల ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. ఎవరైనా సకలాంగులు దివ్యాంగులను వివాహం చేసుకుంటే.. వారికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోంది. అంగవైకల్యం ఉన్నా.. వారితో జీవితం పంచుకునేందుకు కొందరు సకలాంగులు ముందుకొచ్చి వారిని వివాహం చేసుకుంటున్నారు. ఇలాంటి వివాహాలను ప్రోత్సహించేందుకు పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రోత్సాహకాల పేరుతో నగదు ఇచ్చి ఆర్థికంగా ఆదుకుంటున్నాయి.

ట్రెండింగ్ వార్తలు