Air Conditioner
దేశంలో ఎయిర్ కండిషనర్ల టెంపరేచర్ 20 నుంచి 28 డిగ్రీల మధ్యే ఉండేలా పరిమితి విధించే అవకాశం ఇప్పట్లో లేదని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. దీనిని క్రమంగా ప్రవేశపెడతారని చెప్పారు.
ఏసీల విషయంలో కొత్త టెంపరేచర్ పరిమితి ఎప్పటి నుంచి అమలు అవుతుందని ఇండియా క్లైమేట్ సమిట్‌లో భూపేందర్ యాదవ్‌ను ప్రశ్నించగా ఆయన స్పందిస్తూ.. “ఈ పరిస్థితులు 2050 తర్వాతే వచ్చే అవకాశం ఉంది” అని తెలిపారు.
దీన్ని దశలవారీగా అమలు చేస్తారని చెప్పారు. ఈ నిబంధన అమలు చేయడానికి అవసరమైన సాంకేతికత, సామర్థ్యాలను అందిస్తామని వెల్లడించారు. వాతావరణానికి సంబంధించిన లక్ష్యాలు, దేశ పరిస్థితులకు అనుగుణంగా దీన్ని ప్రవేశపెట్టాలని తెలిపారు.
అలాగే, భారత ప్రభుత్వం ఐక్యరాజ్య సమితికి సమర్పించిన ప్రణాళికలో భాగంగా ప్రతి ఒక్కరికీ విద్యుత్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
సీబీడీఆర్-ఆర్‌సీ సూత్రాల ప్రకారం ప్రపంచంలోని ప్రతి దేశం వాతావరణ మార్పు సమస్యపై పోరాడాలి. అయితే అభివృద్ధి చెందిన దేశాలు దీనిపై మరిన్ని చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ దేశాలే అధిక కాలుష్యానికి కారణమయ్యాయి. ఆ దేశాల వద్దే ఎక్కువ వనరులు ఉన్నాయి.
దేశంలో ఎయిర్ కండిషనర్ల టెంపరేచర్‌పై పరిమితులు విధించే అంశంపై ఇటీవల కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మాట్లాడుతూ.. త్వరలో ఏసీలను 20 నుంచి 28 డిగ్రీల మధ్య టెంపరేచర్‌కి పరిమితం చేస్తారని అన్నారు. ఈ నేపథ్యంలోనే భూపేందర్ యాదవ్ దీనిపై స్పష్టత ఇచ్చారు.
కాగా, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషెన్సీ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం చాలా ఏసీలను 20 నుంచి 21 డిగ్రీల మధ్య వినియోగిస్తున్నారు. 24 నుంచి 25 డిగ్రీల టెంపరేచర్ తో ఏసీలను వినియోగిస్తే సౌకర్యవంతంగా ఉండడంతో పాటు విద్యుత్ కూడా ఆదా అవుతుంది. టెంపరేచర్ ఒక్క డిగ్రీ పెంచితే 6 శాతం విద్యుత్ ఆదా చేయొచ్చు.