GSAT 30 ప్రయోగానికి ISRO రెడీ

  • Publish Date - January 16, 2020 / 01:06 AM IST

ఈ ఏడాది అంతరిక్ష ప్రయోగాలకు జీశాట్‌-30తో బోణీ కొట్టేందుకు ఇస్రో సిద్ధమైంది. దేశ ఇంటర్నెట్‌ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే అత్యాధునిక జీశాట్‌-30 ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. దక్షిణ అమెరికా ఫ్రెంచ్‌ గయానాలోని యూరోపియన్‌ స్పేస్‌ పోర్టు నుంచి ఆ దేశానికే చెందిన ఎరియన్‌ -5 రాకెట్‌ ద్వారా దీన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.

భారత కాలమానం ప్రకారం 2020, జనవరి 17వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున 2.35 గంటలకు ఈ రాకెట్‌ జీశాట్‌-30తో నింగిలోకి దూసుకుపోనుంది. స్పేస్‌ పోర్టులోని 3వ ఎరియన్‌ లాంచ్‌ కాంప్లెక్స్‌ నుంచి ఈ ప్రయోగం జరగనున్నట్టు ఇస్రో వెల్లడించింది.

ప్రయోగ సన్నాహకాల్లో భాగంగా యూరోపియన్‌ స్పేస్‌పోర్టు శాస్త్రవేత్తలు లాంచ్‌ రెడీనెస్‌ రివ్యూ సమావేశాన్ని నిర్వహించారు. 2020, జనవరి 16వ తేదీ గురువారం మధ్యాహ్నం 3.12 గంటలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించాలని నిర్ణయించారు. ఇస్రోకు చెందిన శాస్త్రవేత్తల బృందం ఫ్రెంచ్‌ గయానాకు చేరుకుని వాహక నౌకలో జీశాట్‌-30 ఉపగ్రహాన్ని అనుసంధానం చేస్తున్నారు.

ఈ ఉపగ్రహం బరువు 3,357 కిలోలు. ఇది కమ్యూనికేషన్‌ ఉపగ్రహం. దీనిద్వారా టెలివిజన్‌, టెలీకమ్యూనికేషన్‌ బ్రాడ్‌కాస్టింగ్‌కు సంబంధించి మెరుగైన సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇది జియో స్టేషనరీ ఆర్బిట్ నుంచి సీ, కేయూ బ్యాండ్లలో కమ్యూనికేషన్ సేవలను అందిస్తుంది.

జీశాట్ బరువు సుమారు 3357కిలోలు. ఐ-3కే ప్లాట్‌ఫామ్‌లో దీన్ని తయారు చేశారు. ఇన్శాట్-4ఏకు ప్రత్యామ్నాయంగా జీశాట్-30 పనిచేయనుంది. భారత్‌తో పాటు అనుబంధ దేశాలకు ఈ శాటిలైట్ ద్వారా కేయూ బ్యాండ్లో సిగ్నల్ అందించనుండగా గల్ఫ్ దేశాలకు సీ బ్యాండ్ ద్వారా కవరేజ్ ఇవ్వనున్నారు. ఆసియాలో కొన్ని దేశాలతో పాటు ఆస్ట్రేలియాకు కూడా సీ బ్యాండ్ ద్వారా సేవలు అందిస్తారు.

Read More : సంక్రాంతి కోళ్ల పందాలు : పోతే వేలు..వస్తే లక్షలు