గుజరాత్‌లోని ఐదు మెట్రో నగరాలలో(అహ్మదాబాద్, గాంధీనగర్, సూరత్, వడోదర, రాజ్‌కోట్) 70 అంతస్తులకు పైగా ఆకాశహర్మ్యాల నిర్మాణానికి విజయ్ రూపానీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
గుజరాత్ లోని ప్రధాన నగరాలను అంతర్జాతీయ స్థాయిలో ఆధునిక నగరాలుగా మార్చడానికి ఆకాశహర్మ్యాలు, ఎత్తైన ఐకానిక్ భవనాల నిర్మాణం అవసరమని భావించిన సీఎం విజయ్ రూపానీ…రెండు వందలకు పైగా నగరాల పట్టణ ప్రణాళికను సరళీకృతం చేసి ఆధునీకరించిన తరువాత 70 అంతస్తుల ఎత్తుతో ఉన్న భవనాలను అహ్మదాబాద్, గాంధీనగర్, సూరత్, వడోదర, రాజ్‌కోట్ లో నిర్మించేందుకు ఆమోదించారు.
రాష్ట్రంలో ఇటీవల 22, 23 అంతస్తుల భవనాల నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఐకానిక్ స్ట్రక్చర్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని నిర్ణయించినట్లు సీఎం రూపానీ తెలిపారు. వీటి నిర్మాణం కోసం ముంబై వంటి నిర్మాణం, సాంకేతిక, అగ్నిప్రమాదాల నుంచి భద్రతకు ఆమోదం కోసం ప్రత్యేక సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు.
ప్రజల పెరుగుదల, ఉపాధి మార్గాల లభ్యత, భూమి ధరలు నిరంతరం పెరుగుతున్నందున సరసమైన గృహనిర్మాణంలో ఐకానిక్ భవనాలు సహాయపడుతాయని సీఎం చెప్పారు. 100 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న భవనాలకు పలు నియమాలను సిద్ధం చేశారు. 30 మీటర్ల వెడల్పు మార్గంలో మాత్రమే నిర్మించాలి. విండ్ టన్నెల్ పరీక్షలు అవసరం. ఎలక్ట్రిక్ ఛార్జింగ్ తప్పనిసరిగా ఉండాలి. పార్కింగ్ స్థలంలో విపత్తు నిర్వహణ ప్రణాళిక అవసరమని నియమాల్లో పేర్కొన్నారు. గుజరాత్ ప్రభుత్వ నిర్ణయంతో ఇకపై దుబాయ్, సింగపూర్ మాదిరిగా త్వరలో గుజరాత్‌లో కూడా ఆకాశహర్మ్యాలను మనం చూడొచ్చు.