Uddhav Thackeray : రాముడు పుట్టకపోయి ఉంటే బీజేపీ నినాదం ఏమై ఉండేదో..?హిందుత్వంపై పేటెంట్ హక్కు ఉన్నట్లే వ్యవహరిస్తుంది..

‘రాముడు పుట్టకపోయి ఉంటే బీజేపీ నినాదం ఏమై ఉండేదో..?హిందుత్వంపై పేటెంట్ హక్కు ఉన్నట్లే వ్యవహరిస్తుంది’ అంటూ బీజేపీపై మహారాష్ట్రం సీఎం ఉద్థవ్ ఠాక్రే విమర్శలు చేశారు.

CM Uddhav Thackeray comments on BJP and Hindutva : బీజేపీపై శివసేన పార్టీ అధినేత..మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే ధ్వజమెత్తారు. సెటైర్లతో బీజేపీ నేతలపై ఉద్ధవ్ విరుచుకుపడ్డారు. కొల్హాపూర్ నార్త్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరగనుండగా, మహావికాస్ అఘాడీ కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్థి జయశ్రీ జాదవ్ తరఫున సీఎం ఉద్ధవ్ థాకరే వర్చువల్ ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా ఉద్ధవ్ మాట్లాడుతూ..
హిందుత్వంపై బీజేపీకి మాత్రమే పేటెంట్ ఉన్నట్టు మాట్లాడుతుంటారంటూ ఎద్దేవా చేశారు. రాముడు తమవాడే అన్నట్లుగా బీజేపీ వ్యవహరిస్తుందంటూ చురకలు వేశారు ఉద్ధవ్.బీజేపీకి దారిచూపింది బాల్ థాకరే అని ఆ విషయాన్ని బీజేపీ గుర్తుంచుకోవాలంటూ స్పష్టం చేశారు ఉద్ధవ్ ఠాక్రే.

ఆదివారం (ఏప్రిల్ 10,2022) ఉద్ధవ్ మాట్లాడుతూ బీజేపీకి హిందూత్వంపై పేటెంట్ హక్కు లేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. హిందుత్వంపై తనకే సర్వహక్కులు ఉన్నట్టు బీజేపీ భావించరాదని హితవు పలికారు. హిందుత్వం, కాషాయం కలిస్తే కేంద్రంలో అధికారంలోకి రావొచ్చని బీజేపీకి మార్గదర్శనం చేసింది దివంగత శివసేన చీఫ్ బాల్ థాకరే అని ఉద్ధవ్ థాకరే స్పష్టం చేశారు ఉద్ధవ్.

కాషాయం-హిందుత్వం కలయికపై శివసేన ఎప్పటికీ నిబద్ధతతో ఉంటుందని అన్నారు. కానీ బీజేపీ మాత్రం భారతీయ జనసంఘ్, జనసంఘ్ అంటూ రకరకాల పేర్లతో భిన్నమైన సిద్ధాంతాలను ప్రచారం చేస్తోందని ఆరోపిస్తూ ఉద్ధవ్ థాకరే తీవ్ర విమర్శలు చేశారు. ఉద్ధవ్ ఠాక్రే ఇంకా మాట్లాడుతూ..నాకు ఒక విషయంలో ఆశ్చర్యం వేస్తుంది… ఒకవేళ రాముడే పుట్టకపోయి ఉంటే ఈ బీజేపీ వాళ్లు రాజకీయాల్లో ఏ నినాదం తలకెత్తుకునేవారో అనిపిస్తుంటుంది” అని ఉద్ధవ్ థాకరే అన్నారు.

2019లో బీజేపీ ఓట్లు ఎక్కడికి పోయాయి..? ఆ సమయంలో కాంగ్రెస్‌తో మీకు (బీజేపీ) రహస్య పొత్తు ఉందా? అని థాకరే ఈ సందర్భంగా ప్రశ్నించారు.బాల్ ఠాక్రేని గౌరవిస్తున్నామని బిజెపి చెబుతుంటే, రాబోయే నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి దివంగత సేన వ్యవస్థాపకుడి పేరు పెట్టే ప్రతిపాదనను ఆ పార్టీ ఎందుకు వ్యతిరేకిస్తోంది? అని ఉద్ధవ్ ప్రశ్నించారు.

ట్రెండింగ్ వార్తలు