Rahul Gandhi and arvind kejriwal
Haryana Elections Result 2024: హరియాణా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) సత్తాచాటాయి. హరియాణాలో వరుసగా మూడోసారి బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకొని హ్యాట్రిక్ కొట్టింది. రాష్ట్రంలో మొత్తం 90 సీట్లకు గాను బీజేపీ 48 స్థానాల్లో విజయం సాధించగా.. కాంగ్రెస్ 37, ఐఎన్ఎల్డీ రెండు, స్వతంత్ర అభ్యర్ధులు మూడు స్థానాల్లో విజయం సాధించారు. బీజేపీకి మొత్తం 39.94శాతం ఓట్లు రాగా.. కాంగ్రెస్ పార్టీకి 39.09శాతం, ఐఎన్ఎల్డీకి 4.14శాతం ఓట్లు వచ్చాయి. అయితే, ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పోటీ చేసింది. ఆ పార్టీకి 1.79 శాతం ఓట్లు పోలయ్యాయి. కానీ, ఒక్క స్థానంలోనూ అభ్యర్థులు విజయం సాధించలేదు. అయితే, కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని దూరంచేయడంలో ఆమ్ ఆద్మీ పార్టీ కీలక పాత్ర పోషించినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీని కలుపుకొని ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీచేసి ఉంటే అధికారంలోకి వచ్చేదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Also Read: ఈ తీర్పును అంగీకరించలేం: హరియాణా ఫలితాలపై కాంగ్రెస్ అనుమానాలు
హరియాణా జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో ఆమ్ఆద్మీ పార్టీ పోటీ చేసింది. హర్యానాలో ఒక్క స్థానంలోనూ ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించలేదు. అయితే, జమ్ముకశ్మీర్ లో ఒక స్థానంలో ఆప్ అభ్యర్థి విజయం సాధించారు. దోడా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్ధిపై ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్ధి మెహ్రాజ్ మాలిక్ విజయం సాధించారు. హరియాణాలో మాత్రం కాంగ్రెస్ జోరుకు ఆప్ అడ్డుకట్ట వేసినట్లు స్పష్టమవుతుంది. కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు ఓడిపోయిన ఓట్ల కంటే ఆప్ అభ్యర్ధికి ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇలా దాదాపు పదికిపైగా నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో ఉదాహరణకు కొన్ని నియోజకవర్గాలను పరిశీలిస్తే..
◊ అస్సాంధ్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిపై బీజేపీ అభ్యర్ధి 2306 ఓట్ల తేడాతో విజయం సాధించాడు. ఆ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్ధికి 4290 ఓట్లు పోలయ్యాయి.
◊ దబ్వాలీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి 610 ఓట్ల తేడాతో ఓడిపోగా.. ఆ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్ధికి 6,606 ఓట్లు పోలయ్యాయి.
◊ ఉచన్ కలాన్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేవలం 32 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్ధికి 2495 ఓట్లు పోలయ్యాయి.
◊ రానియా నియోజకవర్గంలో ఐఎన్ఎల్డీ అభ్యర్ధి కాంగ్రెస్ అభ్యర్ధిపై 4191 ఓట్ల తేడాతో విజయం సాధించాడు. ఆ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్ధికి 4697 ఓట్లు పోలయ్యాయి.
◊ దాద్రి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిపై కాంగ్రెస్ అభ్యర్థి 1957 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్ధికి 1339 ఓట్లు పోలయ్యాయి.
◊ రేవారి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధికి 28వేల పైచిలుకు ఓట్లతో ఓడిపోగా.. ఆ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్ధికి 18వేల ఓట్లు పోలయ్యాయి.
Also Read: Vijayawada Indrakiladri : విజయవాడ ఇంద్రకీలాద్రికి చంద్రబాబు, పవన్.. ఇవాళ ప్రత్యేకత ఏమిటంటే?
ఇలా దాదాపు పదికిపైగా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్ధులు ఓటమి చెందిన ఓట్ల కంటే ఆప్ అభ్యర్ధులకు పోలయిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ, ఆప్ కు వచ్చిన ఓట్ల శాతం కలుపుకొని చూస్తే బీజేపీ కంటే దాదాపు 1శాతం ఓటింగ్ షేర్ ఎక్కువగా ఉంది. హరియాణా ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి 37 సీట్లు వచ్చాయి. బీజేపీ తొమ్మిది సీట్లను ఎక్కువగా కలిగి ఉంది. ఆప్ తో కాంగ్రెస్ పొత్తుపెట్టుకొని ఉండిఉంటే హరియాణాలో కచ్చితంగా కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉండేవని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.