రైతన్నలకు వరుడు మద్ధతు : బెంజ్ కారు దిగి ట్రాక్టర్ పై పెళ్లిమండపానికి

  • Published By: nagamani ,Published On : December 5, 2020 / 05:31 PM IST
రైతన్నలకు వరుడు మద్ధతు : బెంజ్ కారు దిగి ట్రాక్టర్ పై పెళ్లిమండపానికి

Updated On : December 5, 2020 / 6:05 PM IST

Haryana groom tractor over mercedes to reach wedding venue : హర్యానాలోని కర్నల్ ఏరిలోని ఓ పెళ్లికొడుకు తన దైనశైలిలో రైతన్నల ఆందోళనలకు మద్దతు తెలిపాడు. పెళ్ళికొడుకుగా చక్కగా ముస్తాబై మండపానికి వెళ్ళడానికి మెర్సిడెస్ బెంజ్ కారు అందంగా డెకరేట్ చేయించుకున్నాడు. కానీ అంతబాగా డెకరేట్ చేయించుకున్న ఆ కారులో కాకుండా ట్రాక్టర్ ఎక్కి పెళ్లి మండపానికి వెళ్లాడు. అది చూసిన అతిథులు మొదట ఆశ్చర్యపోయినా తరువాత విషయం తెలిసి మెచ్చుకున్నారు.



వివరాల్లోకి వెళితే..కర్నల్ లోని సెక్టార్ 6 ప్రాంతానికి చెందిన సుమిత్ ధుల్ తన పెళ్ళిని ఎంతో ఘనంగా చేసుకోవాలనుకున్నాడు. పెళ్లికి ఊరేగుతూ వెళ్లటానికి బెంజ్ కారుని డెకరేట్ చేయించాడు. పెళ్లిమండపానికి హుందాగా వెళ్ళడానికి అన్ని హంగులూ పూర్తయ్యాయి. కానీ .. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న రైతుల ఆందోళనకు తన వంతుగా మద్దతు ప్రకటించాలని అనుకున్నాడు. రైతన్నలంతా ఆందోళనలు చేస్తుంటే తాను దర్జాగా బెంజ్ కారులో వెళ్లటమేంటీ? రైతన్నలకు చాలా అవసరమైన ట్రాక్టర్ మీద వెళ్లి తన మద్దతుని తెలిపాలనుకున్నాడు. అలా ట్రాక్టర్ ఎక్కి పెళ్ళిమండపంలో అడుగుపెట్టాడు.



‘ఢిల్లీ చలో’ ఆందోళనలో భాగంగా వేలమంది రైతన్నలు రాజధాని ఢిల్లీ వైపుగా కథం తొక్కరు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా ఈ ఉద్యమంలో నలుమూలల నుంచి రైతులంతా తమ మద్దతును తెలియజేసారు. అలాగే సుమిత్ కూడా తన మద్దతుని ఈ రకంగా తెలియజేశాడు.


ఈ సందర్భంగా సుమిత్ మాట్లాడుతూ..’నేను రైతు కుటుంబం నుంచే వచ్చాను.దేశవ్యాప్తంగా రైతులు చేస్తున్న ఉద్యమానికి నా వంతు మద్దతు తెలపాలనుకున్నాను..ఆ ఆలోచన వచ్చాక చివరి క్షణంలో బెంజ్ కారులో వెళ్లబుద్ది కాలేదు. రైతుల వ్యవసాయానికి ఉపయోగించే ట్రాక్టర్లో వచ్చానని తెలిపాడు. ప్రస్తుతం చాలామంది మన సొంత గ్రామాలు వదిలి పట్టణాలకు వెళ్ళి వుండొచ్చు. కాని మన మూలాలు వ్యవసాయంతోనే ముడిపడి వున్నాయని మరచిపోకూడదనీ..అందుకే రైతులకు ప్రజలందరి మద్దతు ఉందనే సమాచారం చేరాలి. అందుకే ఇలా చేశాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక్కడ మరో విశేషం ఏమంటే పెళ్లి పూర్తైన తర్వాత దంపతులిద్దరూ కలిసి ఢిల్లీ సరిహద్దుల్లో ఉన్న రైతుల నిరసన స్థలానికి వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు.



కాగా..వారం రోజులకు పైగా రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వంతో జరిపిన రెండు విడతల చర్చలు ఫలించలేదు. ప్రభుత్వం చెప్పేవాటికి రైతులు అంగీకరించలేదు.తమ డిమాండ్స్ నెరవేరేవరకూ నిరసనలు ఆపేది లేదని తేల్చి చెప్పారు.



ఉత్తర ప్రదేశ్, పంజాబ్, హర్యానాల నుంచి వచ్చే రైతులతో ఢిల్లీ సరిహద్దులు అట్టుఉడికిపోతున్నాయి. నిరసనకారులైన రైతు సంఘాలు తమ డిమాండ్లలో ఏమాత్రం మార్పు ఉండదని తెగేసి చెప్పారు. ఈక్రమంలో వ్యవసాయ చట్టంలో మార్పులు చేసిన రైతులకు భరోసా ఇవ్వాలనే ఆలోచనలో ప్రధాని మోడీ ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంట్లో భాగంగానే ప్రధాని మోడీ ఈరోజు అంటే శనివారం (డిసెంబర్ 5,2020)న మంత్రులతో సమావేశమయ్యారు. రైతులకు సంబంధి సమస్యలపై చర్చలు జరుపుతున్నారు.