ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి సలహాలివ్వండి : బెంగళూరు పోలీసులు

  • Published By: chvmurthy ,Published On : April 23, 2019 / 04:07 PM IST
ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి సలహాలివ్వండి : బెంగళూరు పోలీసులు

Updated On : April 23, 2019 / 4:07 PM IST

బెంగళూరు: బెంగళూరులో నానాటికీ పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యను తీర్చటానికి  ట్రాఫిక్ పోలీసులు ఇప్పుడు నగర ప్రజల సలహాలు,సూచనలు అడుగుతున్నారు. సరైన ట్రాఫిక్ మేనేజ్ మెంట్ లేక పోవటం వల్లే బెంగళూరులో ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతోందనేది బెంగళూరు వాసుల అభిప్రాయం. 25 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన ట్రాఫిక్ మేనేజ్ మెంట్ కమిటీలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి.  కానీ ఇప్పుడు నగరంలోని 44 ట్రాఫిక్ పోలీసు స్టేషన్ల పరిధిలో ట్రాఫిక్ సలహా కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు.  ఇందులో స్ధానికులకు అవకాశం కల్పించి వారి సహకారంతో  అక్కడ ఏర్పడే ట్రాఫిక్ సమస్యను  పరిష్కరించేలా ఏర్పాట్లు చేస్తోంది  పోలీసు డిపార్ట్ మెంట్.  

స్ధానికంగా శాశ్వత  నివాసం ఉండే వారిని  వీటిల్లో సభ్యులుగా చేర్చుకుని ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి  వారి సూచనలు సలహాలు స్వీకరించాలని  ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు.  రెండు దశాబ్దాల క్రితం ఏర్పాటు చేయాలనుకున్న కమిటీలు  నేటికి కార్యరూపం దాలుస్తున్నాయి. ఆటో డ్రైవర్ కానీ, సాఫ్ట్ వేర్ ఇంజనీరైనా, క్యాబ్ డ్రైవరైనా సరే  ట్రాఫిక్ సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించే వారందరికీ ఈ కమిటీల్లో స్ధానం కల్పిస్తామని బెంగళూరు ట్రాఫిక్ పోలీస్ కమీషనర్ పి.హరిశేఖరన్ చెప్పారు. ఈకమిటీలు పోలీసు అధికారులతో కలిసి పని చేస్తాయని, వీటిలో స్దానికంగా పనిచేసే  జర్నలిస్టునుకూడా చేర్చుకుంటామని ఆయన తెలిపారు.  

పోలీసు అధికారులు ప్రతినెల  మూడవ శనివారం నిర్వహిస్తున్న గ్రీవెన్స్ సెల్ ద్వారా వచ్చే ఫిర్యాదులను ఆయా పోలీసు స్టేషన్లలోని కమిటీలకు పంపించి సమస్య సత్వర పరిష్కారానికి కృషి చేయనున్నారు. ప్రజల  భాగస్వామ్యం పెరిగితే మరింత సమర్ధవంతంగా  కమిటీలను ఏర్పాటు చేసి ట్రాఫిక్ నియంత్రణ చేయగలుగుతామని పోలీసు అధికారులు అంటున్నారు. కాగా … ఈ ట్రాఫిక్  మేనేజ్ మెంట్ కమిటీలన్నీ కంటి తుడుపు చర్యలని కొందరు నిపుణులు కొట్టి పారేస్తున్నారు. 25 ఏళ్లుగా ప్రజలు ఇచ్చిన విజ్ఞప్తులను ఎవరు అమలు చేశారని వారు  ప్రశ్నిస్తున్నారు. ట్రాఫిక్ మేనేజ్ మెంట్  కమిటీలు కేవలం ట్రాఫిక్ రద్దీ సమస్యలను గుర్తించడానికి మాత్రమే సహాయ పడతాయని కొందరు అభిప్రాయపడుతున్నారు.