హెచ్‌ఎంపీవీ కేసులపట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఈ వైరస్ పట్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జాగ్రత్త చర్యలు పాటించాలని ప్రజలకు సూచిస్తున్నాయి. అది కిల్లర్ వైరస్ కాదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా చెప్పింది.
కేసుల నిర్వహణ కోసం గుజరాత్ లో మూడు నగరాల్లోని సివిల్ హాస్పిటల్స్‌లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేశారు. గాంధీ నగర్, అహ్మదాబాద్, రాజ్ కోట్ ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేశారు. వైరస్ వ్యాప్తిని పర్యవేక్షించడానికి మిజోరం ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది.
బిహార్ ప్రభుత్వం ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. వైరస్‌ను గుర్తించేందుకు ఫ్లూ డెస్క్‌లను ఏర్పాటు చేయాలని ఆసుపత్రులను ఆదేశించింది. దేశంలో శ్వాసకోశ వ్యాధుల ప్రస్తుత పరిస్థితిని వాటి నిర్వహణ కోసం తీసుకోవాల్సిన ప్రజారోగ్య చర్యలపై సమీక్షించింది కేంద్ర ప్రభుత్వం.
దేశంలో శ్వాసకోశ వ్యాధుల పెరుగుదల లేదని కేంద్రం చెప్పింది. కేసులను గుర్తించేందుకు పటిష్ఠమైన నిఘా చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. హెచ్‌ఎంపీవీ నివారణ చర్యలపై ప్రజల్లో అవగాహన పెంచాలని రాష్ట్రాలకు సూచించింది. దేశ వ్యాప్తంగా మొత్తం 8 హెచ్‌ఎంపీవీ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ కేసులపై డబ్ల్యూహెచ్‌వోతో కేంద్ర సర్కారు సంప్రదింపులు జరుపుతోంది.
Los Angeles: లాస్ ఏంజిల్స్‌లో కార్చిచ్చు కలకలం.. 30 వేల మంది తరలింపు