హనీట్రాప్ కేసు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసును విచారించేందుకు ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి సంజీవ్ షమీ అధ్యక్షతన సిట్‌ని ఏర్పాటు చేసింది. ఈ కుంభకోణంలో 12 మంది బ్యూరోక్రాట్లు, 8 మంది రాజకీయ నాయకులు ఉన్నట్లు సిట్ వెల్లడించింది. వీరిలో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర గవర్నర్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ హనీట్రాప్ కుంభకోణానికి సూత్రదారి శ్వేతా జైన్. ప్రస్తుతం సిట్ ఆమెను విచారిస్తుంది. ఈ విచారణలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. కాలేజీ విద్యార్థినులను ఎలా భాగం చేస్తున్నారు.. తర్వాత వారితో చేయించే అకృత్యాలు, తద్వారా తాము పొందే లాభాల గురించి శ్వేతా జైన్ సిట్ ముందు వెల్లడించింది.
శ్వేతా జైన్ భర్త స్వాప్నిల్ జైన్ ఓ ఎన్జీవోను ప్రారంభించాడు. ముందుగా ఈ సంస్థ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న మధ్య తరగతి కుటుంబాలను ఎంచుకుంటుంది. ఆ ఇళ్లలో ఉన్న చదువుకునే, యుక్త వయసు అమ్మాయిలకు జాబ్ ఇప్పిస్తాను, చదువుకునేందుకు సాయం చేస్తామంటూ మాయమాటలు చెప్తుంది. వ్యభిచారం చేసేలా ప్రోత్సహిస్తుంది. ఆ తర్వాత శ్వేతా జైన్ రంగంలోకి దిగుతుంది. నెమ్మదిగా సదరు యువతులకు ఆడంబరమైన జీవితాన్ని రుచి చూపిస్తుంది.
భారీ మొత్తంలో డబ్బు ఇచ్చి.. తాను చెప్పినట్లు చేస్తే ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని ఆశపెడుతుంది. ఆ తర్వాత వారిని నెమ్మదిగా తన సెక్స్ రాకెట్ కోసం వాడుకుంటుంది. ఇలా కాలేజీకి వెళ్లే యువతులను రాజకీయ నాయకులకు, ఉన్నతాధికారులకు ఎర వేస్తుంది శ్వేతాజైన్. ఆ అధికారులు, నాయకుల కోరిక మేరకు సదరు యువతులను వారి వెంట టూర్‌లకు, ఫైవ్‌స్టార్ హోటళ్లకు పంపేది. అనంతరం వారు శృంగారంలో పాల్గొంటుండగా చాటుగా వీడియో తీసేది. ఆ తర్వాత ఈ వీడియోలను చూపించి సదరు అధికారులను, నాయకులను బ్లాక్‌మెయిల్ చేసి భారీ కాంట్రాక్టులు, ఎన్జీవోకు అధిక మొత్తంలో విరాళాల రూపంలో డబ్బు సంపాదించేది.
ఒక్కసారి శ్వేతా జైన్ చేతిలో పడిన యువతులు ఈ ఉచ్చు నుంచి బయటకు రావడం కష్టం. శ్వేత చేస్తున్న అక్రమాల గురించి పోలీసులకు గానీ, మీడియాకు గానీ చెప్పాలని చూస్తే.. వారి వీడియోలను ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేస్తానని బెదిరించేది. దాంతో యువతులు కూడా కామ్‌గా ఉండేవారు. ఇలా సాగుతున్న శ్వేతా జైన్ అక్రమాలకు ఓ ఇంజనీర్ ఇచ్చిన ఫిర్యాదు అడ్డుకట్ట వేసింది. తీగ లాగడంతో డొంక అంతా కదిలింది.
శ్వేత మాత్రమే కాకుండా ఆర్తి దయాల్ అనే మహిళ కూడా ఇలాగే అధికారులకు, రాజకీయ నాయకులకు వలపు వల వేసినట్లు పోలీసులు తేల్చి ఆమెను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ కేసును, సీడీలు, హార్డ్ డిస్క్‌ను సిట్‌కు అప్పగించారు. అయితే, తమ పేర్లు ఎక్కడ బయటికి పొక్కుతాయోనన్న టెన్షన్‌తో రాజకీయ నాయకులు, అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
Read More : మధ్యప్రదేశ్ లో హనీట్రాప్…వేగవంతమైన సిట్ విచారణ