హనీమూన్‌కు వెళ్లిన ఈ కొత్త జంటకు అసలు ఏమైంది? బండరాయికి చిక్కుకుపోయి కనపడ్డ అమ్మాయి షర్టు… యువకుడు మృతి

పోలీసులకు ఇప్పటివరకు ఈ వివరాలు తెలిశాయి.

ఇండోర్‌కు చెందిన ఓ నూతన వధూవరులు ఇటీవల హనీమూన్‌ కోసం మేఘాలయాలోని చిరపుంజీకి వెళ్లారు. ఆ తర్వాత వారు అదృశ్యం కావడం కలకలం రేపింది. ఈ కేసులో పోలీసులు పురోగతి సాధించి, పలు కీలక విషయాలను గుర్తించారు.

మేఘాలయాలోని చిరపుంజీలో వైసాడాంగ్‌ లోయలోని జలపాతం వద్ద ఓ బండరాయికి ఇరుక్కుని ఓ నూతన వధువుకు సంబంధించిన తెల్ల షర్టు కనపడింది. ఆ ప్రాంతంలో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షానికి ఆ షర్టు కూడా బాగా పాడైంది. ఆ వధువు ఆచూకీ ఇప్పటికీ తెలియరాలేదు.

ఆ షర్టుకి దగ్గరలోనే ఆమె భర్త మృతదేహం పడి ఉంది. అతడి కుడి చేతికి ఇప్పటికీ ఒక స్మార్ట్‌వాచ్ ఉంది. అతడి మృతదేహం కాస్త కుళ్లిపోయి కనపడింది. వీటిని పోలీసులు డ్రోన్‌ ద్వారా గుర్తించారు. కొంత కాలంగా అతడి మృతదేహం అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది.

దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇండోర్‌కు చెందిన ఓ నూతన వధూవరులు ఇటీవల హనీమూన్‌ కోసం చిరపుంజీకి వెళ్లారని గుర్తించారు. ఆ మహిళ పేరు సోనమ్ (24), ఆమె భర్త పేరు రాజా రఘువంశీ (28) అని చెప్పారు.

ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్‌లో ఉన్న రాజా రఘువంశీ హనీమూన్‌కు వెళ్లేందుకు సంబంధించి కొన్ని నెలలుగా ఏర్పాట్లు చేసుకున్నాడు. అతను తన భార్య సోనమ్ ఇటీవల ఇండోర్‌ నుంచి మేఘాలయాకు హనీమూన్‌కి తీసుకెళ్లాడు.

అక్కడ ఆ జంటకు ఏమి జరిగిందో తెలుసుకోవడానికి మేఘాలయా పోలీసులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రయత్నిస్తోంది. వీసా దాంగ్ లోయ వద్ద రఘువంశీని కొందరు దుండగులు కత్తితో పొడిచి చంపారని సిట్ నిర్ధారించింది. అతడి మృతదేహంతో పాటు ఓ కత్తి, అతడి స్మార్ట్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక సోనమ్ చొక్కా మాత్రమే దొరికిందని, ఆమె ఆచూకీ ఇంకా లభ్యం కాలేదని పోలీసులు వివరించారు.

సోనమ్ తన అత్తయ్యతో చివరిసారిగా ఫోనులో మాట్లాడిన మాటలు బయటకు వచ్చాయి. తాము అడవిలో ట్రెక్కింగ్ చేస్తున్నామని, అక్కడ ఉన్న జలపాతాన్ని చూడడానికి వెళ్తున్నామని ఆమె చెప్పింది. ఫోన్‌లో మాట్లాడుకోవడం ఇదే చివరిసారి. ఆ తర్వాత కొడుకు, కోడలు నుంచి ఆమెకు ఫోన్ రాలేదు. దీనిపై అదృశ్యం కేసును నమోదుచేసుకున్న పోలీసులకు ఇప్పటివరకు ఈ పై వివరాలు తెలిశాయి. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.