రాజకోట స్పెషల్: సముద్రంలో గుర్రపు బండ్లపై ప్రయాణం..!

గుర్రపు బళ్లు రోడ్డుమీద ప్రయాణం చేస్తాయి. కానీ ఓ ప్రాంతంలో మాత్రం గుర్రపుబళ్లు సముద్రంలో ప్రయాణం చేస్తాయి. స్పెషల్ టూరిస్ట్ ప్లేస్. ఇదేదో విచిత్రంగా ఉందే..అదెక్కడో వెంటనే వెళ్లిపోవాలనుంది కదూ..ఆ విశేషాలేంటో చూద్దాం..
మహారాష్ట్రలోని అలీబాగ్ బీచ్‌కు వెళ్తే.. గుర్రపు బండ్లు సముద్రంలో తిరుగుతూ కనిపిస్తాయి. అలీబాగ్‌లో సముద్ర తీరంలో కొలాబా అనే పురాతన కోట ఉంది. ఒకప్పుడు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ కోట కాలక్రమేణా సముద్ర నీటి మట్టం పెరిగి సముద్రంలో కలిసిపోయింది. దీంతో ఆ ప్రాంతం చిన్న సైజు దీవిలా తయారైంది. ఆ కోటకు వెళ్లాలంటే ఆ నీళ్లలో నడుచుకుంటూ వెళ్లడం చాలా ప్రమాదం. ఈత వచ్చినా ప్రమాదమే. ఎందుకంటే అక్కడ ఒక్కోసారి సముద్రమట్టం సడెన్ గా పెరిగిపోతుంది.
కానీ కాలం చేసే గారడీ ఆ కోటపై ఇంట్రెస్ట్ ను పెంచింది. నీటి మధ్యలో ఉన్న ఆ కోటను చూడాలని చాలామంది టూరిస్టులు ఆసక్తి చూపిస్తుంటారు. దీన్ని క్యాష్ చేసుకునేందుకు స్థానికులు గుర్రపు బండ్లును సముద్రంలో నడుపుతూ టూరిస్టుల్ని కోట వద్దకు తీసుకెళుతుంటారు. కానీ ఇది అత్యంత ప్రమాదం కూడా.
అందుకే గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వటంలేదు. అయినా స్థానికులు గుర్రపు బండ్లను నడుపుతున్నారు. టూరిస్టులు కూడా కోటను చూడాలనే ఆసక్తితో ఆ గుర్రపు బళ్లపై ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని ప్రమాదాలు కూడా జరిగిన సందర్భాలున్నాయి.
ఈ ప్రయాణంపై జంతు హక్కుల సంఘాలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాయి. తమ స్వార్థం కోసం గుర్రాలను బాధపెడుతున్నారంటూ ఫిర్యాదు చేశాయి. సముద్రంలో పడవులు మాత్రమే ప్రయాణించాలని, వాటికి బదులు గుర్రపు బండ్లను ఉపయోగించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. రోజంతా సముద్ర నీటిలో ప్రయాణించటంతో గుర్రాలు అనారోగ్యానికి గురై చనిపోతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ జంతు హింసను అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కోటను సందర్శించాలనుకునే పర్యాటకుల కోసం పడవలను అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పడవ ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.