How Much Gold You Can Hold Under Income Tax Rules (1)
Gold Possession Income Tax Rules : భారత్ మార్కెట్లో అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడులలో బంగారం ఒకటి. బంగారం కూడా లెక్కకు మించి ఉంటే సమస్యే మరి.. సంపాదన కంటే ఎక్కువగా కూడబెట్టిన ప్రతిదానికి ఆదాయ పన్ను శాఖకు లెక్కచెప్పాల్సింది ఉంటుంది. ఒకవేళ మీరు ఆర్జించిన ఏదైనా ఆస్తి లేదా బంగారానికి ఇన్వాయిస్ లేకుంటే.. పరిమితికి మించి బంగారాన్ని కలిగి ఉండటం చట్టపరంగా సమస్యలను ఎదుర్కోక తప్పదు. ప్రత్యక్ష పన్నుల (CBDT) సెంట్రల్ బోర్డు మార్గదర్శకాల ప్రకారం.. ఇన్ వాయిస్ లేకుండా బంగారాన్ని నిర్దిష్ట పరిమితికి మించి కొనుగోలు చేస్తే.. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 132 కింద ఆదాయపు పన్ను శాఖ ప్రశ్నించవచ్చు.
మీరు బంగారాన్ని కొనుగోలు చేస్తే.. ఆ సంవత్సరానికి మీ ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటిఆర్)ను దాఖలు చేసేటప్పుడు మీరు దాని గురించి ఆస్తి వివరాలలో పేర్కొనాల్సి ఉంటుంది. ఎలాంటి ఇన్ వాయిస్ లేకుండా ఎంత బంగారం వరకు కలిగి ఉండవచ్చనే దానిపై SAG ఇన్ఫోటెక్ ఎండి అమిత్ గుప్తా వివరణ ఇచ్చారు. ఆదాయపు పన్ను శాఖ నిబంధనల ప్రకారం.. పెళ్లి అయిన వివాహితురాలు ఎవరైనా 500 గ్రామలు బంగారం వరకు ఇన్ వాయిస్ లేకుండా కలిగి ఉండొచ్చు. అదే పెళ్లికాని యువకులు, యువతుల విషయంలో ఇన్వాయిస్ లేకుండా బంగారం పరిమితి వరుసగా 250 గ్రాములు, 100 గ్రాముల వరకు కలిగి ఉండొచ్చు.
ఇన్ వాయిస్ లేకపోయినా అపరిమితంగా బంగారాన్ని కలిగి ఉండొచ్చుననే అపోహ చాలామంది భారతీయుల్లో ఉందని రిజిస్టర్డ్ టాక్స్ సొల్యూషన్ సంస్థ (SEBI) మేనేజింగ్ డైరెక్టర్ పేర్కొన్నారు. వాస్తవానికి ఈ చట్టం డిసెంబర్ 2016లో రూపొందించారు. ఆదాయపు పన్ను శాఖకు బంగారం అంటే.. బంగారు ఆభరణాలు, బంగారు నాణేలు, బార్‌లు మొదలైన అన్ని రకాల భౌతిక బంగారమని అన్నారు. పరిమితికి మించి బంగారాన్ని కలిగి ఉండేందుకు ఆదాయ పన్ను శాఖకు ఎలా సమాధానం చెప్పాలో సెబీ రిజస్టర్డ్ టాక్స్, ఇన్వెస్ట్‌మెంట్ నిపుణుడు జితేంద్ర సోలంకి వివరణ ఇచ్చారు. భారతదేశంలో పూర్వీకుల నుంచి ఇన్వాయిస్ లేకుండా బంగారం కలిగి ఉంటారు.
ఒక ఇంట్లో ఇన్వాయిస్ లేకుండా ఎంత బంగారం ఉందో తప్పక తెలియజేయాల్సి ఉంటుంది. పూర్వీకుల నుంచి లేదా ఏదైనా బంధువు నుంచి బంగారం అదనంగా పొందితే.. ఆ ఆర్థిక సంవత్సరం ఐటిఆర్ ఫైలింగ్ సమయంలో ఒకరి ఆస్తి వివరాలలో దాని గురించి ప్రస్తావించడం మంచిదంటున్నారు. ఒకవేళ ఇన్వాయిస్ లేకపోతే.. పూర్వీకుల నుంచి లేదా ఏదైనా బంధువు నుండి పొందిన బంగారానికి వెంటనే విలువ కట్టాల్సిందిగా సోలంకి సలహా ఇచ్చారు.
బంగారం సంబంధించి ఆస్తి వివరాల గురించి ఆదాయపు పన్ను శాఖకు తెలియజేయడానికి ఇది వారికి సహాయపడుతుందని ఆయన తెలిపారు. ఒకరి ఐటిఆర్ ఆస్తి వివరాలలో బంగారం వివరాలను పేర్కొంటే.. ఇన్వాయిస్‌తో బంగారం కలిగి ఉండటం సమస్య కాదని సోలంకి తెలిపారు. కానీ, ఇన్వాయిస్ లేకుండా భౌతిక బంగారం పరిమితిని తెలుసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు. ఎందుకంటే ఇది ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి మారుతుందని అన్నారు. అందుకే ఎవరైనా సరే బంగారం పరిమితి కంటే ఎక్కువగా ఉంటే తప్పనిసరిగా ఇన్ వాయిస్ కలిగి ఉండాలని సూచిస్తున్నారు.