ఖాకీలకు మస్కా : పెళ్లికొడుకులా ముస్తాబైన ఎస్పీ నేత

  • Publish Date - September 14, 2019 / 11:01 AM IST

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. నిషేదాజ్ఞలు అమల్లో ఉండటంతో ఎవరూ బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో సమాజ్ వాదీ పార్టీ నేత ఫిరోజ్ ఖాన్ వినూత్నంగా ఆలోచించారు.

పెళ్లికొడుకు వేషంలో పోలీసుల కళ్లుగప్పి తన వాహనంలో పార్టీ సీనియర్ నేత అజమ్ ఖాన్ కలిసేందుకు వెళ్లారు. తలపై షెహ్రా ధరించి అచ్చం పెళ్లికొడుకులా ముస్తాబై పోలీసులను ఏమార్చి వెళ్లారు. అజామ్ ఖాన్ కు మద్దతుగా ఫిరోజ్ ఖాన్ రాంపూర్ కు వెళ్లారు. 

సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అజమ్ ఖాన్ కలువనున్న నేపథ్యంలో పోలీసులు ముందుస్తు చర్యగా రాంపూర్‌లో 144 సెక్షన్ విధించి భద్రత కట్టుదిట్టం చేశారు. రాంపూర్ లోక్ సభ ఎంపీ అజామ్ ఖాన్ పై పలు కేసులు నమోదయ్యాయి. ఒక నెలలోనే 80 కేసులు వరకు ఖాన్ పై పోలీసులు నమోదు చేశారు. వీటిలో మేక, గేదెల దొంగతనానికి సంబంధించి కేసులు నమోదు అయ్యాయి.

తనపై బనాయించిన కేసులపై అజామ్ ఖాన్ తీవ్రంగా ఖండించారు. తనపై నమోదైన కేసులన్నీ నిరాధారమైనవని, రాంపూర్ జిల్లా అధికారులు, పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు చేస్తున్నారని, కానీ, తన వెంట ప్రజలు ఉన్నారని ఖాన్ చెప్పారు.