Gujarat Bridge Collapse: మోర్బీలో తీగల వంతెన ఎలా కూలిపోయింది.. ప్రత్యక్ష సాక్షులు ఏమన్నారంటే..

టికెట్ కౌంటర్ నుండి సుమారు 220 టికెట్లు జారీ చేశారని, అయితే సెక్యూరిటీ గార్డు ప్రజలను లోపలికిరాకుండా ఆపడంలో విఫలమవడంతో చాలా మంది టికెట్ లేకుండా ఒక్కసారిగా బ్రిడ్జిపైకి వచ్చారని మోర్బి మునిసిపల్ అథారిటీ అధికారి ప్రాథమిక విచారణను ఉటంకిస్తూ చెప్పారు.

Gujarat Bridge Collapse: గుజరాత్ మోర్బీలో మచ్చు నదిపై తీగల వంతెన కూలిపోయి దాదాపు 140 మందికిపైగా మరణించారు. వందలాది మంది గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఛత్ పూజ సందర్భంగా ఆదివారం సాయంత్రం ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. నదిలో విగ్రహాల నిమజ్జనాన్ని చూడటానికి ప్రజలు 140ఏళ్ల నాటి వంతెనపైకి భారీగా తరలిరావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 765 మీటర్ల పొడవున్న వంతెనను అక్టోబర్ 26న మరమ్మతుల అనంతరం ప్రారభించారు. అయితే.. సాధారణంగా ప్రజలు వంతెన గుండా నడుస్తారు, అవతలి వైపు నుండి నిష్క్రమిస్తారు. బ్రిడ్జిపైకి భారీ సంఖ్యలో ప్రజలు చేరుకోవటంతో పాటు నిలుచుండిపోవటంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు.

Gujarat Cable Bridge Collapse : గుజరాత్‌ కేబుల్‌ బ్రిడ్జి ప్రమాదం.. బీజేపీ ఎంపీ కుటుంబానికి చెందిన 12 మంది మృతి

అధికారుల వివరాల ప్రకారం.. టికెట్ కౌంటర్ నుండి సుమారు 220 టికెట్లు జారీ చేశారని, అయితే సెక్యూరిటీ గార్డు ప్రజలను లోపలికిరాకుండా ఆపడంలో విఫలమవడంతో చాలా మంది టికెట్ లేకుండా ఒక్కసారిగా బ్రిడ్జిపైకి వచ్చారని మోర్బి మునిసిపల్ అథారిటీ అధికారి ప్రాథమిక విచారణను ఉటంకిస్తూ చెప్పారు. సాయంత్రం 6.15 గంటలకు వంతెనపై దాదాపు 400 నుంచి 450 మంది వరకు ఉన్నారు. వారిలో కొందరు నిలబడి ఉన్నారు. కొంతమంది యువకులు బ్రిడ్జపై దూకుతూ వంతెనను ఊపుతున్నారు. బ్రిడ్జి ఊగుతూ చాలా శబ్దం చేస్తోందని, ఈ క్రమంలో ఉన్నట్లుండి ఒక్కసారిగా బ్రిడ్జి కుప్పకూలిందని బనారస్‌కు చెందిన నిర్మాణ కార్మికుడు అజయ్ కుమార్ తెలిపాడు. మరో స్థానికుడు మాట్లాడుతూ.. బ్రిడ్జి పడిన సమయంలో ప్రజలు ఒకరిపై ఒకరు పడిపోయారు. వారిలో కొందరు నదిలో పడిపోయారు. 4.5 అడుగుల వెడల్పు ఉన్న వంతెనపై కొందరు రెయిలింగ్‌లు పట్టుకుని తమను తాము రక్షించుకున్నారని, ఆ సమయంలో అక్కడ భయానక పరిస్థితి, కేకలతో పాటు సహాయంకోసం పెద్దగా అరుపులు వినిపించాయని చెప్పాడు.

స్వామినారాయణ ఆలయంలో కార్పెంటర్‌గా పనిచేసే 24ఏళ్ల పంకజ్ కుమార్ మాట్లాడుతూ.. మేము మా ఇళ్ల దగ్గర కూర్చున్నా. వంతెనపై రద్దీగా ఉందని నా స్నేహితుడు నాకు చెబుతున్నాడు. అదేసమయంలో అకస్మాత్తుగా సహాయం కోసం అరుపులు విని మేము వంతెనవైపుకు పరుగెత్తాము. అక్కడ చాలా మంది ప్రజలు వేలాడుతూ ఉన్నారు. చాలా మంది నదిలో పడి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ సమయంలో ఆ ప్రాంతం అరుపులు, కేకలతో మారుమోగింది. రాత్రి వేళ కావటంతో మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది. అయితే, మేము వంతెనపై నుండి వేలాడుతున్న దాదాపు 30-35 మందిని రక్షించగలిగామని చెప్పాడు.

ట్రెండింగ్ వార్తలు