హౌడీ మోదీ సమావేశానికి హాజరైన ప్రధానికి ఘనస్వాగతం లభించింది. టెక్సాస్ సెనేటర్ టెడ్ క్రూస్ మోదీని వేదికపైకి ఆహ్వానించగా… మోదీ రెడ్ కార్పెట్‌పై నడుచుకుంటూ వేదికపైకి వచ్చారు. ఆ సమయంలో సమావేశం ఆవరణలో ఉన్న ప్రవాస భారతీయులు మోదీ.. మోదీ అంటూ నినాదాలు చేశారు. కరతాళ ధ్వనులతో స్వాగతం పలికారు. వేదికపై రాగానే ప్రజలందరికీ మోదీ నమస్కరించారు.
వేదికపై ఉన్న వారితో కరచాలనం చేశారు. తనకు అపూర్వ స్వాగతం లభించిందంటూ హ్యూస్టన్ వాసులకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. రెండోసారి ప్రధాని అయిన తరువాత ఎన్ఆర్ఐల సమక్షంలో ప్రధాని మోదీ ప్రసంగించడం ఇదే తొలిసారి. హౌడీ మోదీ కార్యక్రమానికి వచ్చిన ట్రంప్‌కు ప్రధాని మోదీతో పాటు ప్రవాస భారతీయులు ఘనస్వాగతం పలికారు. వేదిక వద్దకు విచ్చేసిన ట్రంప్‌కు భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ స్వాగతం పలకగా… మోదీ స్వయంగా వేదికపైకి తోడ్కొని వెళ్లారు. ఈ సభలో భారత్, అమెరికా దేశాల జాతీయ గీతాలు ఆలపించారు.
హౌడీ మోదీ సభలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. భారతీయ సంప్రదాయ నృత్యాలు అలరించాయి. శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు సభికుల్ని మైమరపించాయి. హౌడీ మోదీ కార్యక్రమానికి ఇరు దేశాల అగ్రనేతలు హాజరై… ఒకే వేదికపై ప్రసంగించడం ఇదే తొలిసారి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మొత్తం 600 మంది నిర్వాహకులు, 1500 మంది వలంటీర్లు శ్రమించారు.
Read More : ఉగ్రవాదంపై ఇక యుద్ధమే : అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ – మోదీ