స్కూళ్ల రీ ఓపెన్ పై సంప్రదింపులు షురూ

ప్రతిఏటా ఈ జూన్ నెలలో స్కూల్స్, కాలేజీలు ఓపెన్ అయ్యేవి. కానీ ఈసారి కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా మార్చి మధ్య నుంచి స్కూల్స్ మూతపడ్డాయి. దీంతో తిరిగి స్కూల్స్ ఎప్పుడు రీ ఓపెన్ చేయాలనే విషయంపై కేంద్రం సతమతమవుతోంది. విద్యా సంస్థల ప్రారంభంపై కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు చర్చిస్తున్నాయి. అయితే సోమవారం (జూన్ 8, 2020) సంప్రదింపులు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.
స్కూళ్లు, కాలేజీలు తెరవడంపై ఎడ్యుకేషన్ కార్యదర్శి అనితా కార్వాల్ వివిధ రాష్ట్రాల విద్యాశాఖ కార్యదర్శులతో మాట్లాడారు. విద్యార్థుల ఆరోగ్యం, పాఠశాలల్లో పరిశుభ్రత, ఆన్‌లైన్, డిజిటల్ ఎడ్యుకేషన్ తదితర అంశాలపై వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. స్కూళ్లు ఎప్పుడు తెరుస్తారనే అంశంపై అటు విద్యార్థులు, తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యాలు కూడా సందిగ్ధంలో ఉన్నాయి.
విద్యార్ధులకు భద్రత చాలా ముఖ్యం:
రాష్ట్రాల నుంచి వచ్చిన అభిప్రాయాలను క్షుణ్నంగా పరిశీలించి స్కూల్స్ రీ ఓపెన్ చేయడానికి తదుపరి చర్యల నిమిత్తం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు, హోంశాఖకు నివేదించనున్నట్లు మానవ వనరుల అభవృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ తెలిపారు. టీచర్స్, స్టూడెంట్స్ భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. రాష్ట్రాలతో సంప్రదింపులు ఇప్పుడే మొదలయ్యాయని, స్కూళ్ల రీ ఓపెన్ పై తుది నిర్ణయం కేంద్ర హోంశాఖదేనని అధికార వర్గాలు పేర్కొన్నాయి.