మెన్స్‌ డే కావాలని బీజేపీ మహిళా ఎంపీ డిమాండ్‌

దేశ వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్న క్రమంలో..పురుషుల కోసం ఓ రోజు ఉండాలని బీజేపీ పార్టీకి చెందిన మహిళా ఎంపీ సోనాల్ మాన్ సింగ్ సూచించారు.

mens day

BJP MP Sonal Mansingh : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 08వ తేదీన జరుపుకుంటారనే సంగతి తెలిసిందే. కానీ..మెన్స్ డే ఉండదా ? ఉండాలంటున్నారు బీజేపీ మహిళా ఎంపీ సోనాల్ మాన్ సింగ్. ఈ మేరకు రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. 2021, మార్చి 08వ తేదీ సోమవారం రాజ్యసభలో బీజేపీ పార్టీకి చెందిన మహిళా ఎంపీ సోనాల్ మాన్ సింగ్ ప్రసంగించారు. మహిళా దినోత్సవాన్ని దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న క్రమంలో..పురుషుల కోసం ఓ రోజు ఉండాలని సూచించారు. ఇందుకు మెన్స్ డే నిర్వహించాలని డిమాండ్ చేయడం విశేషం. అన్నిరంగాల్లో పురుషులతో సమానంగా..మహిళలు రాణించాలని పిలుపునిచ్చారామె.

ఇద్దరు జర్మన్ దేశానికి చెందిన మహిళలు మహిళా దినోత్సవాన్ని ప్రారంభించారని, ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా..తొలిసారి ఓ భారీ సముద్ర నౌకను మహిళలే పూర్తిస్థాయిలో సారథ్యం వహించడం భారతదేశానికే గర్వకారణమన్నారు. అయితే..కొన్నిచోట్ల మహిళలు తీవ్రమైన వివక్షతను ఎదుర్కొంటున్నారని సభలో ఆమె వెల్లడించారు.

అనేక దినోత్సవాల మాదిరిగానే..పురుషుల దినోత్సవం నిర్వహించాలనే డిమాండ్స్ అప్పుడప్పుడు వినిపిస్తుంటాయి. చట్టసభల్లో ఇలాంటి ప్రతిపాదనలు ఎప్పుడూ వినిపించవు. పురుషుల దినోత్సవం అనే అధికారిక తేదీని ప్రకటించకపోయినా..నవంబర్ 19వ తేదీని పురుషుల దినోత్సవంగా అక్కడక్కడ కొన్ని కార్యక్రమాలు జరుగుతుంటాయి.