స్త్రీలకు రక్షణ లేదా?: మహిళా ఐఏఎస్ కే వేధింపులు తప్పలేదు

  • Publish Date - September 27, 2019 / 03:54 AM IST

ఆకతాయిల ఆగడాలు ఎక్కువైతే ఎవరికి చెప్పుకుంటాం.. పోలీసులకు చెప్పుకుంటాం.. వారి కంటే ఉన్నతమైన హోదా అంటే ఐఏఎస్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఓ మహిళా ఐఏస్ అధికారిణి మాత్రం మగవాళ్లను నుంచి వేధింపులు ఎదుర్కొన్నట్లుగా సోషల్‌ మీడియాలో సంచలన వ్యాఖ్యలు పోస్ట్ చేశారు. తన సొంత కార్యాలయంలో, తన చాంబర్‌లోని మగవాళ్లు తనపట్ల అనుచితంగా వ్యవహరించారంటూ ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ వర్షా జోషీ సంచలన ఆరోపణలు చేశారు. తన కార్యాలయంలో కొందరు మగవాళ్లు పరిధికి మించి ప్రవర్తించారంటూ వర్షా జోషీ ట్వీట్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ఆకతాయిల నుంచి మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులు, ఎగతాళి వ్యాఖ్యల గురించి ఓ మహిళ ట్విటర్‌ వేదికగా వర్షా జోషి దృష్టికి తీసుకొచ్చారు. ‘ఈ వీధి గుండా వెళ్లడం ఏ మహిళకైనా చాలా కష్టం. ఇక్కడ కూర్చొని ఉన్న పురుషులు రోజంతా అదే పనిగా మహిళలను చూస్తూ.. హుక్కా పీలుస్తూ.. పేకాట ఆడుతూ వేధిస్తూనే ఉంటారు. ఈ విషయం గురించి ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోట్లేదని, దయచేసి దీనిపై చర్య తీసుకోండి’ అని ఓ మహిళ వర్షా జోషికి ట్విట్టర్ ద్వారా ట్వీట్‌ చేశారు.

దీనిపై స్పందించిన.. వర్షా జోషీ ‘నిజానికి పోలీసులు చర్య తీసుకోవాల్సిన అంశమే కానీ. ఉత్తర భారతంలో మహిళలు ఇటువంటి సవాళ్లను ఎదుర్కొంటూనే ఉన్నారు. నా ఆఫీస్‌ చాంబర్‌లోనే నేను అసభ్య ప్రవర్తనను ఎదుర్కొన్నాను. కొంతమంది మగవాళ్లు తమ పరిధికి మించి ప్రవర్తించారు. వారు ఏం చేస్తున్నారనేది వాళ్లకే అర్థం కాట్లేదు. ఇటువంటి వాటికి పరిష్కారాలు ఏమున్నాయి. పనిచేసే చోట ఇంకా ఇటువంటి వేధింపులు ఎక్కువగా ఉన్నాయి.’ అంటూ ఆమె ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉన్నతస్థాయిలో ఉన్న వ్యక్తులకే ఇటువంటి వేధింపులు ఉంటే సామాన్యుల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అని నెటిజన్లు అంటున్నారు.